రూ.20 లక్షల కోట్లు ప్యాకేజ్ పెద్ద బోగస్: కేసీఆర్‌

May 19, 2020


img

కేంద్రప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్లు ప్యాకేజ్ పెద్ద బోగస్ అని తెలంగాణ సిఎం కేసీఆర్‌ అభివర్ణించారు. ప్రగతి భవన్‌లో నిన్న రాత్రి ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, “కేంద్రం ప్రకటించిన ఆ ఆర్ధిక ప్యాకేజీ అంతా డొల్ల. బోగస్. దాని వలన రాష్ట్రాలకు కానీ దేశప్రజలకు గానీ ఒరిగేదేమీ ఉండదు. అది కేవలం అంకెల గారడీయే తప్ప మరేమీ కాదు. జాతీయ, అంతర్జాతీయ పత్రికలు సైతం ఇదే చెపుతున్నాయి. ఇటువంటి సంక్షోభసమయంలో రాష్ట్రాలను ఆదుకోవలసిన కేంద్రప్రభుత్వం ఆర్ధిక ప్యాకేజీ పేరుతో వాటి మెడపై కత్తిపెట్టినట్లు అనేక ఆంక్షలు విధించి రాష్ట్రాలను తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకోవడం చాలా దుర్మార్గం. కేంద్రప్రభుత్వం రాష్ట్రాలను బిచ్చగాళ్ళుగా భావిస్తోంది. అందుకే ప్యాకేజీ పేరుతో ముష్టి విదిలిస్తోంది.

కేంద్రం ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీలో రూ.2,500 కోట్లు పొందాలంటే విద్యుత్ సంస్కరణలు చేప్పట్టాలట. మరో రూ.2,500 కోట్లు పొందాలంటే మునిసిపల్ సంస్కరణలు చేపట్టాలట! సంస్కరణలంటే విద్యుత్ ఛార్జీలు, పన్నులు పెంచడమే. లాక్‌డౌన్‌ కారణంగా తీవ్ర ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటున్న వివిద వర్గాల ప్రజలకు చేయూత నీయవలసిన ఈ సమయంలో ప్యాకేజీ కోసం వారిపై అదనపు భారం మోపమనడం చాలా అమానుషం. అన్యాయం. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వ్యతిరేకిస్తున్నాను.

రాష్ట్రాలకు రుణపరిమితి పెంచి అదేదో ఘనకార్యమన్నట్లు చెపుకొంది. ఆ అప్పును తిరిగి చెల్లించేది రాష్ట్రాలే కానీ కేంద్రప్రభుత్వం కాదు కదా? ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఫెడరల్ స్పూర్తి ప్రదర్శించవలసిన కేంద్రప్రభుత్వం ఫ్యూడల్ (నియంతృత్వ)వైఖరి ప్రదర్శించడం సిగ్గుచేటు. కేంద్రప్రభుత్వం తన పరువును తానే తీసుకొంది.

కేంద్రప్రభుత్వం చెపుతున్న విద్యుత్ సంస్కరణలను మేము పార్లమెంటులో కూడా వ్యతిరేకిస్తాం. రాష్ట్రంలో వాటిని అమలుచేయబోము. కేంద్రం సాయం అందించినా అందించకపోయినా, అభివృద్ధిపధంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం స్వయం సంవృద్ధి సాధిస్తుంది. ఈ ఆర్ధిక సంక్షోభాన్ని కూడా తప్పకుండా అదిగమిస్తుంది,” అని అన్నారు.


Related Post