జీహెచ్‌ఎంసీ పరిధిలో పెరుగుతున్న కేసులు

May 19, 2020


img

తెలంగాణలో అన్ని జిల్లాలలో కరోనా కేసులు పూర్తిగా అదుపులోకి వచ్చినప్పటికీ జీహెచ్‌ఎంసీ పరిధిలో గల కొన్ని కంటెయిన్మెంట్ జోన్లలో మాత్రం ప్రతీరోజు కొత్తగా కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఆ  ప్రాంతాలలో రాకపోకలు నిషేదించి, జీహెచ్‌ఎంసీ, వైద్యఆరోగ్య సిబ్బంది ఎంతగా కృషి చేస్తున్నప్పటికీ, కరోనా వ్యాప్తి చెందుతూనే ఉండటం ఆందోళనకరంగా మారింది. రాష్ట్రమంతటా కరోనాను కట్టడి చేసినప్పటికీ రాష్ట్రానికి గుండెకాయవంటి హైదరాబాద్‌ నగరంలో అదుపులోకి రాకపోతే హైదరాబాద్‌లో నివశిస్తున్నవారు భయం భయంగా బ్రతకవలసి వస్తుంది. ఇది అభివృద్ధికి అవరోధంగా కూడా నిలుస్తుంది. కనుక జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసులు పెరగడానికి మూలకారణం కనుగొని దానిని నివారించవలసి ఉంది. 

వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం సోమవారం జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 26 కేసులు నమోదయ్యాయి. వాటిలో మూడు కేసులు మేడ్చల్ జిల్లాలో నమోదయ్యాయి. అవి కాక మరో 12 మంది వలస కార్మికులకు కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,592కి చేరింది. కరోనా సోకిన వలస కార్మికులు సంఖ్య 69కి చేరింది. సోమవారం మరో 10 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అవడంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొన్నవారి సంఖ్య 1,002కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రులలో 556 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 34 మంది కరోనాతో మరణించారు. 


Related Post