నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం

May 18, 2020


img

సోమవారం సాయంత్రం 5గంటలకు ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరుగనుంది. మే 31వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ కేంద్రం కొత్తగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసినందున వాటిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి తదుపరి కార్యాచరణను ఖరారు చేయనున్నారు. 

ముఖ్యంగా రాష్ట్రంలోను, ఇరుగుపొరుగు రాష్ట్రాలకు ఆర్టీసీ బస్సులను నడిపించుకొనేందుకు కేంద్రప్రభుత్వం అనుమతించడంతో ఈ అంశంపై ప్రధానంగా చర్చించి నేడు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అయితే పొరుగు రాష్ట్రాలైన తమిళనాడులో చెన్నై, ఏపీలో గుంటూరు, కర్నూలు, కర్ణాటకలో బెంగళూరులో, మహారాష్ట్రలో పూణే, ముంబై నగరాలలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నందున బహుశః అంతర్ రాష్ట్ర సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవచ్చు. రాష్ట్రంలో గ్రీన్, ఆరెంజ్‌ జోన్‌లలో సిటీ బస్సులు తప్ప దూరప్రాంతాలకు వెళ్ళే ఎక్స్‌ప్రెస్‌ బస్ సర్వీసులను నడిపించే అవకాశం ఉంది. 

లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో వేలాది ఆటోరిక్షాలు, షేరింగ్ ఆటోలు, క్యాబ్‌లు నిలిచిపోవడంతో వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నవారి పరిస్థితులు దయనీయంగా మారాయి. కనుక ఈరోజు మంత్రివర్గ సమావేశంలో వాటిని అనుమతించాలా వద్దా? అనే అంశంపై కూడా చర్చించవచ్చు. ఈ నెలాఖరు వరకు దేశవ్యాప్తంగా అన్ని మెట్రో మెట్రో రైల్‌ సేవలపై నిషేదం కొనసాగుతున్నందున, అప్పటి వరకు హైదరాబాద్‌ మెట్రో రైళ్లు కూడా తిరిగే అవకాశం లేదు. 

లాక్‌డౌన్‌ ఆంక్షల విషయంలో కూడా కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు స్వేచ్చనిచ్చింది కనుక గ్రీన్, ఆరెంజ్‌ జోన్‌లలో మరికొన్ని రంగాలకు ఆంక్షలు సడలించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు అన్ని రకాల దుకాణాలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అలాగే పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ తదితర రంగాలలో పనులు చేసుకొనేందుకు అనుమతించింది. కానీ సినీ, టీవీ షూటింగ్స్ లను మాత్రం అనుమతించలేదు. దాంతో వాటిపై ప్రత్యక్షంగా ఆధారపడిన వేలాదిమంది కార్మికులు, జూనియర్ ఆర్టిస్టులు, సిబ్బందితో పాటు పరోక్షంగా సినీ,టీవీ రంగాల ద్వారా ఉపాది పొందుతున్నవారు కూడా నష్టపోతున్నారు. కనుక ఈరోజు మంత్రివర్గ సమావేశంలో దీనిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. 

ఇవికాక రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు, కరోనా కట్టడి, వ్యవసాయం, సాగునీరు తదితర అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో లోతుగా చర్చ జరుగనుంది. కనుక ఈరోజు సమావేశం చాలా కీలకమైనదనే చెప్పవచ్చు. ఈ సమావేశంలో ప్రభుత్వం ఏమి నిర్ణయాలు తీసుకోబోతోంది? ఎటువంటి కార్యాచరణను ప్రకటించబోతోంది?అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.


Related Post