మే 31వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

May 18, 2020


img

ఈ నెల 31 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆదివారం రాత్రి ప్రకటించారు. అయితే ఊహించినట్లుగానే ఈసారి కొన్ని రంగాలకు లాక్‌డౌన్‌ ఆంక్షలను యధాతధంగా కొనసాగించగా మరికొన్నిటికి సడలించింది. రెడ్‌ జోన్‌, కంటెయిన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ ఆంక్షలు యధాతధంగా కొనసాగుతాయి. రాత్రి 7 నుంచి ఉదయం గంటలవరకు కర్ఫ్యూ యధాతధంగా కొనసాగుతుంది. కరోనా వైరస్ హెచ్చుతగ్గులకు అనుగుణంగా జిల్లాలో గ్రీన్, ఆరెంజ్‌, రెడ్ జోన్‌లను నిర్ణయించుకొనేందుకు, జోన్లు మార్చుకొనే అధికారం రాష్ట్రాలకే విడిచిపెట్టింది. రాష్ట్రాలు పరస్పర అంగీకారంతో అంతరాష్ట్ర బస్ సర్వీసులను నడిపించుకొనేందుకు కేంద్రం అనుమతించింది.    

నిషేదించబడినవి: సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్, వ్యాయామశాలలు, స్విమ్మింగ్ ఫూల్స్, వినోద పార్కులు, ప్రార్ధనా మందిరాలు, సామూహిక మత ప్రార్ధనలు, రాజకీయ, సామాజిక  సభలు, సమావేశాలు. 

దేశీయ అంతర్జాతీయ విమానసేవలు, మెట్రో మెట్రో రైల్‌ సర్వీసులపై ఈనెల 31వరకు నిషేధం కొనసాగుతుంది. 

పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లపై కూడా ఈనెల 31వరకు నిషేధం కొనసాగుతుంది. కానీ ఆన్‌లైన్‌ ద్వారా నడిపించుకోవచ్చు. 

హోటల్స్, రెస్టారెంట్లు తెరవకూడదు కానీ డోర్ డెలివరీ చేసుకోవచ్చు. 

క్రీడా మైదానాలు తేర్చుకోవచ్చు కానీ ప్రేక్షకులను అనుమతించరు. 

పెళ్ళిళ్ళు, శుభకార్యాలకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందికి అనుమతి.  

గర్భిణీ మహిళలు, పిల్లలు, 65 ఏళ్ళు పైబడిన వృద్ధులు వీలైనంతవరకు ఇళ్ళలోనే ఉండాలి. 

ఉద్యోగులకు వీలైనంతవరకు ఇళ్ళ నుంచి పనిచేసుకొనే అవకాశం కల్పించాలి. ఈ విధానాన్ని ప్రోత్సహించాలి. 

కార్యాలయాలలో తరచూ శానిటైజేషన్ చేయడం, సామాజిక దూరం పాటించడం, ఇతర కరోనా జాగ్రతలు పాటించడం తప్పనిసరి. కార్యాలయాలకు వేర్వేరు పనివేళలు పాటించాలి. కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలలో ధర్మల్ స్క్రీనింగ్ మెషిన్లను ఏర్పాటు చేయాలి.  

కరోనా తీవ్రత, హెచ్చుతగ్గులను బట్టి కేంద్ర మార్గదర్శకాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వాలే ఆంక్షలు విధించుకోవచ్చు. సడలించుకోవచ్చు.


Related Post