భారత్‌కు ఇదే చివరి అవకాశం?

April 09, 2020


img

విదేశాల నుంచి దేశంలోకి వచ్చిన వారి ద్వారా కంటే డిల్లీ మర్కజ్ సమావేశాలకు వెళ్ళివచ్చినవారి ద్వారానే దేశంలో అన్ని రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విజృంభించిందని స్పష్టమయ్యింది. డిల్లీ మర్కజ్ కేసులను గుర్తించడంలో జరిగిన ఆలస్యం, అలసత్వం కారణంగానే దేశానికి ఈ ఉపద్రవం సంభవించిందని చెప్పక తప్పదు. అందుకు యావత్ దేశం లాక్‌డౌన్‌ కొనసాగింపు రూపంలో చాలా భారీ మూల్యం చెల్లించడానికి సిద్దపడుతోంది.   

కాస్త ఆలస్యంగానైనా డిల్లీ మర్కజ్ కేసులతో జరుగుతున్న నష్టాన్ని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన తరువాత అన్ని రాష్ట్రాలలో వారిని వెతికిపట్టుకొని క్వారంటైన్‌ కేంద్రాలకు, పాజిటివ్ కేసులను ఆసుపత్రులకు పంపిస్తున్నారు. కానీ ఇప్పటికే జరుగకూడని నష్టం చాలా జరిగిపోయింది. వారిద్వారా చాలా మందికి కరోనా మహమ్మారి వ్యాపించింది. కనుకనే దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. ఏప్రిల్ 14న లాక్‌డౌన్‌ ముగిసేవరకు దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఇదేవిధంగా పెరుగుతూనే ఉండవచ్చు. కరోనా సోకి ఇంకా ఇళ్ళలో దాక్కొన్నవారందరికీ ఏప్రిల్ 14నాటికి రోగలక్షణాలు ముదిరి ఇళ్ళలో నుంచి బయటకు రాక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఏప్రిల్ 14 తరువాత కరోనా కేసులు ఇంకా వేగంగా పెరిగే అవకాశాలున్నాయి. 

కరోనాను పూర్తిగా కట్టడి చేయాలంటే కనీసం మరో రెండు వారాలు లాక్‌డౌన్‌ కొనసాగించక తప్పదని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించి అందుకు సిద్దం అవుతున్నాయి. ఆ తరువాత మళ్ళీ మరో రెండు వారాలు లాక్‌డౌన్‌ పొడిగించే శక్తి భారత్‌కు ఉండకపోవచ్చు కనుక అది ముగిసేలోగానే తప్పనిసరిగా ఈ కరోనా ట్రాజెడీ కధను ముగించవలసి ఉంటుంది. అందుకోసం ఈసారి లాక్‌డౌన్‌ సమయంలో మరింత కటినంగా వ్యవహరించక తప్పదు. 

దేశంలో నెలల తరబడి లాక్‌డౌన్‌ కొనసాగకూడదు...వీలైనంత త్వరగా కరోనానుంచి విముక్తి పొంది దేశంలో మళ్ళీ సాధారణ పరిస్థితులు ఏర్పడాలంటే దేశప్రజలు కూడా లాక్‌డౌన్‌ నిబందనలకు కట్టుబడి ఉండటం చాలా అవసరం. లేకుంటే దేశఆర్ధిక వ్యవస్థను, కోట్లాదిమంది పేద ప్రజల జీవితాలను పణంగా పెట్టి అమలుచేస్తున్న ఈ లాక్‌డౌన్‌ల వలన ఎటువంటి ఫలితమూ ఉండదు. అప్పుడు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారుతాయి. కనుక ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు భారతదేశానికి, 130 కోట్ల మంది ప్రజలకు ఇదే చివరి అవకాశమని చెప్పకతప్పదు.


Related Post