రోడ్లపై ఉమ్మితే ఇక జైలుకే!

April 08, 2020


img

మనుషుల నోట్లో లాలాజలమే అనేక ప్రాణాంతక వ్యాధుల నుంచి మనుషులను కాపాడుతుంటుంది. కానీ ఇప్పుడు కరోనా కారణంగా అదే లాలాజలం ఇతరుల ప్రాణాలను హరించివేసే విషంగా మారింది. మన దేశంలో చాలామందికి ప్రతీ రెండు, మూడు నిమిషాలకు ఎక్కడపడితే అక్కడే ఉమ్ముతుండటం బాగా అలవాటు. ఇక పాన్, గుట్కా వగైరా నమిలేవాళ్ళ సంగతి సరేసరి. వాటిని నములుతున్నంతసేపు వారు ఎక్కడ పడితే అక్కడ ఉమ్ముతూనే ఉంటారు. 

దాంతో కరోనా వైరస్ ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంది కనుక బహిరంగ ప్రదేశాలలో ఉమ్మడాన్ని నిషేదిస్తూ బుదవారం తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దాని ప్రకారం ఇక రోడ్లపై, బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, కళాశాలలు తదితర ప్రాంతాలలో ఉమ్మడం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుంది. ఈ ఆదేశాలు తక్షణం రాష్ట్రంలో అమలులోకి వస్తాయని తెలియజేసింది. ప్రజారోగ్యం, భద్రతా దృష్టిలో ఉంచుకొని ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.          



Related Post