సిఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌ నేతల ఆగ్రహం

April 08, 2020


img

సిఎం కేసీఆర్‌ ఇటీవల ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ తప్పుడు వార్తలు వ్రాస్తున్న మీడియా ప్రతినిధులకు కరోనా సోకాలని  శాపనార్ధాలు పెట్టడంపై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదప్రజలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్న కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి, ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “కరోనా వైరస్‌ గురించి సిఎం కేసీఆర్‌ ఏది చెపితే అది అందరూ నమ్మి చప్పట్లు కొట్టాలనుకొంటారు. “పారసిటమాల్ మాత్ర వేసుకొంటే చాలు కరోనా తగ్గిపోతుంది ఎవరూ మాస్కూలు పెట్టుకోనవసరం లేదని అసెంబ్లీలో చెప్పి చప్పట్లు కొట్టించుకొన్న పెద్దమనిషే ఇప్పుడు కరోనా మహమ్మారి చాలా భయంకరమైనది అని చెపుతున్నాడు. ఏప్రిల్ 6 తరువాత రాష్ట్రంలో కరోనా కనిపించదని చెప్పిన కేసీఆరే ఇప్పుడు మరో రెండువారాలు లాక్‌డౌన్‌ కొనసాగించాలని చెపుతున్నారు. అంటే.. మీరు ఏమి చెప్పినా దానికి అందరూ చప్పట్లు కొట్టాలి లేకుంటే వారికి కరోనా సోకాలని శాపాలు పెడతారా?”

ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వాలని సూచించే కేసీఆరే కరోనాను ఎదుర్కోవడంలో జరుగుతున్న పొరపాట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి సలహాలు, సూచనలు ఇస్తే వాటిని స్వీకరించకుండా ఎదురుదాడి చేసి ప్రతిపక్షాల నోళ్ళు మూయించాలని ప్రయత్నిస్తుంటారు. సమస్యలను, లోపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్న మీడియా ప్రతినిధులను కరోనా సోకాలని సిఎం హోదాలో ఉన్న కేసీఆర్‌ శాపాలు పెట్టడం చాలా దారుణం. తప్పులుంటే సరిచేసుకోవాలి కానీ వాటిని ప్రభుత్వం దృష్టికి తెచ్చినవారికి ఈవిధంగా శాపాలు పెట్టడం చాలా శోచనీయం,” అని రేవంత్‌ రెడ్డి అన్నారు. 

సీఎల్పీ నేత భట్టివిక్రమార్క హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కరోనాను ఎదుర్కోవడంలో జరుగుతున్న లోటుపాట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన మీడియాకు కరోనా వైరస్ సోకాలని సిఎం కేసీఆర్‌ శపించడం చూస్తే ఆయన మనసు ఎంత విశాలమైనదో అర్ధమవుతుంది. ఇది పాలకులకు ఉండవలసిన లక్షణం కాదు. ఈ క్లిష్ట పరిస్థితులలో ప్రభుత్వంపై విమర్శలు చేయకూడదని మేమందరం మౌనం వహిస్తున్నాము. కానీ ప్రెస్‌మీట్‌లో కేసీఆర్‌ మాట్లాడిన మాటలు విన్న తరువాత జవాబు చెప్పక తప్పడం లేదు. కరోనా తీవ్రత, దాని విపరీత పరిణామాల గురించి ప్రధాని నరేంద్రమోడీకి, సిఎం కేసీఆర్‌కు తెలిసి ఉన్నప్పటికీ మార్చి 22 వరకు అది వ్యాపించకుండా ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. దేశాన్ని, రాష్ట్రాన్ని కరోనా వైరస్‌ కమ్ముకొన్న తరువాత మేల్కొన్న వారిరువురూ ఇప్పుడు తామే ప్రజలను కరోనా బారి నుంచి కాపాడుతున్నట్లు మాట్లాడుతున్నారు. కానీ నానాటికీ పెరుగుతున్న కరోనా కేసులు, మృతుల సంఖ్య చూస్తుంటే, వారిరువురూ కరోనాను ఎదుర్కోవడంలో విఫలమయ్యారని స్పష్టమవుతోంది. ప్రెస్‌మీట్‌లు పెట్టి ప్రతిపక్షాలను, మీడియా ప్రతినిధులను ఆడిపోసుకోవడం కాక, కరోనా బారి నుంచి రాష్ట్ర ప్రజలను ఏవిధంగా కాపాడాలో ఆలోచిస్తే మంచిది. లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగాలు, ఉపాది కోల్పోయినవారిని ఏవిధంగా ఆదుకోవాలో ఆలోచిస్తే మంచిది,” అని అన్నారు.


Related Post