వారందరికీ పాదాభివందనాలు చేస్తున్నా: కేసీఆర్‌

April 06, 2020


img

తెలంగాణ సిఎం కేసీఆర్‌ సోమవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ,”కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి మనమంతా ఇళ్ళకే పరిమితమవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడితే, వైద్యులు, నర్సులు, ఫార్మాసిస్టులు, వైద్యసిబ్బంది, హైదరాబాద్‌ మొదలు గ్రామస్థాయి వరకు పనిచేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది, పారిశుద్యకార్మికులు, ఆశావర్కర్లు, పోలీసులు తదితరులు ఎందరో మనకోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి రేయింబవళ్లు పనిచేస్తున్నారు. వారందరూ మన కంటికి కనిపించే దేవుళ్ళవంటివారే. మనందరి ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను అడ్డేసి పనిచేస్తున్న వారందరికీ రెండు చేతులు ఎత్తి పాదాభివందనాలు చేస్తున్నాను. 

వైద్యసిబ్బందికి పూర్తి జీతం చెల్లించడమే కాకుండా వారి గ్రాస్ సాలరీపై 10 శాతం‘సిఎం గిఫ్ట్’గా అందించాలని నిర్ణయించాము. వెంటనే వారికి ఈ సొమ్ము చెల్లిస్తాము. 

హైదరాబాద్‌ మొదలు గ్రామస్థాయి వరకు మొత్తం 95,392 మంది పారిశుద్య కార్మికులు రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారు. వారందరూ రాష్ట్రంలో ప్రతీగల్లీలో మందులను పిచ్చికారీ చేస్తూ ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ కరోనా వ్యాపించకుండా అడ్డుకొంటున్నారు. వారికి జీతాలలో 10 శాతం కోత విధించడం చాలా పొరపాటే. కనుక వారికి ఆ సొమ్ము వెంటనే తిరిగి చెల్లించడమే కాకుండా వారికి కూడా ‘సిఎం గిఫ్ట్’ అందజేయాలని నిర్ణయించాము. 

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్ సిబ్బందికి రూ.7,500 చొప్పున, మునిసిపాలిటీల పరిధిలో పనిచేస్తున్నవారికి ఒక్కొక్కరికీ రూ.5,000 చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందజేస్తాము. ఒకటి రెండురోజులలోనే వారికి ఈ సొమ్ము అందేలా చేస్తాము,” అని ప్రకటించారు. 


Related Post