ప్రధానిని అవహేళనా? సిగ్గుపడాలి: కేసీఆర్‌

April 06, 2020


img

సిఎం కేసీఆర్‌ సోమవారం సాయంత్రం  ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, “దేశప్రధాని అంతటి వ్యక్తి దీపాలు వెలిగించాలని ప్రజలకు పిలుపునిస్తే, దాని వెనుక ఉద్దేశ్యం గ్రహించకుండా, ఆయన అలా ఎందుకు చెప్పారో అర్ధం చేసుకోకుండా సోషల్ మీడియాలో కొందరు నోటికి వచ్చినట్లు అవాకులు చవాకులు వాగారు. అటువంటివారు సిగ్గుపడాలి. ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రజలలో ధైర్యం నింపేందుకు, మనమంతా ఒకరికొకరం తోడున్నామని తెలియజేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. తెలంగాణ సాధన సమయంలో కూడా మేము ఇటువంటి అనేక కార్యక్రమాలు చేపట్టాము. అప్పుడూ కొందరు ఇలాగే మమ్మల్ని అవహేళన చేశారు. కానీ అటువంటి కార్యక్రమాల వల్లనే ప్రజల మద్య ఐఖ్యత పెరిగి చివరికి అందరం కలిసి పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకోగలిగాము కదా? ఇదీ అంతే. అయినా దేశ ప్రధాని, ముఖ్యమంత్రి, కలక్టర్ వంటివారు వ్యక్తులు కారు. వ్యవస్థలు. వారినే మనం గౌరవించుకోలేకపోతే ఇంకెవరిని గౌరవిస్తాము?” 

“ఇటువంటి క్లిష్టసమయంలో మీడియా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. వీలైతే ప్రజలలో ధైర్యం నింపే ప్రయత్నాలు చేయాలి. ఇంకా వీలైతే ఇటువంటి సమయంలో ఎవరెవరు ఎంత కష్టపడుతున్నారో...ప్రజలను కాపాడేందుకు ఏవిధంగా కృషి చేస్తున్నారో ప్రజలకు తెలియజేసి ప్రజలలో స్పూర్తినింపే ప్రయత్నాలు చేయాలి. కానీ గాంధీ ఆసుపత్రిలో వైద్యులకు, నర్సులకు భద్రత లేదు... వారికి ధరించడానికి రక్షణ దుస్తులు లేవూ..అంటూ అబద్దాలు, తప్పుడు వార్తలు, పుకార్లు వ్యాపిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేయడం సిగ్గుచేటు. 

తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న వైద్యులను, నర్సులను, ఆసుపత్రి సిబ్బందిని ఏవిధంగా కాపాడుకోవాలో... వారికి ఏమి అవసరమో  మాకు తెలియదా? రాష్ట్రంలో ఈ కరోనా మహమ్మారి ఇంకా పెరిగినా ఎదుర్కొనేందుకు అవసరమైన ఆసుపత్రులు, ఐసోలేషన్ వార్డులు, ఎప్పుడు ఫోన్‌ చేస్తే అప్పుడు విధులకు హాజరయ్యే సుమారు 25,000 వైద్య సిబ్బందిని అన్ని సిద్దం చేసి ఉంచుకొన్నాము. మాస్కూలు, రక్షణ దుస్తులు అన్నీ ముందే సిద్దం చేసి ఉంచుకొన్నాము. కనుక మీడియాలో ఒక వర్గం, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను, పుకార్లను చూసి ప్రజలు భయాందోళనలు చెందవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. 

ఇటువంటి తప్పుడు వార్తలు వ్రాస్తూ, తప్పుడు ప్రచారం చేస్తూ, పుకార్లు పుట్టిస్తున్నవారిపై మున్ముందు చాలా కటినమైన చర్యలు తీసుకొంటానని ఇదివరకే హెచ్చరించాను.       అటువంటివారిని మళ్ళీ నేను మరోసారి తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. కనీసం ఇప్పటికైనా మీ ధోరణి మార్చుకోకపోతే తరువాత మీపై చాలా కటినచర్యలు తీసుకొంటాను. నా హెచ్చరికను తేలికగా తీసుకొంటే తరువాత మీరే చింతిస్తారు” అని హెచ్చరించారు.


Related Post