నయాన్న చెప్పడం అయ్యింది...ఇక

April 06, 2020


img

భారత్‌లో 3 వారాల లాక్‌డౌన్‌తో కరోనా మహమ్మారి పూర్తిగా అదుపులోకి వస్తోందని సంతోషించేలోగానే డిల్లీ, నిజాముద్దీన్‌ మత సమావేశాలలో పాల్గొని రాష్ట్రాలకు తిరిగివచ్చినవారి ద్వారా వారం రోజుల వ్యవధిలోనే ప్రతీరోజూ  వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతుండటంతో సోమవారం నాటికి దేశంలో 4,361 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 

మార్చి 20వ తేదీనాటికి దేశంలో కేవలం 209 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మార్చి 30నాటికి 1,071 కేసులు, ఏప్రిల్ 1 నాటికి 1,397 కేసులు, ఏప్రిల్ 3నాటికి 2,301 కేసులు, ఏప్రిల్ 4నాటికి 3,127 కేసులు, ఏప్రిల్ 6 మధ్యాహ్నం 12.30 గంటలకు 4,361 కేసులు నమోదు అయ్యాయి. 

ఈ గణాంకాలను బట్టి చూస్తే మార్చి 15 తరువాత నిజాముద్దీన్‌ మత సమావేశాలలో పాల్గొన్నవారు రాష్ట్రాలకు తిరిగి వచ్చినప్పటి నుంచే కరోనా వైరస్‌ శరవేగంగా దేశమంతటా విస్తరించిందని స్పష్టమవుతోంది. కనుక ఏప్రిల్ 14న లాక్‌డౌన్‌ గడువు ముగిసేలోగా ఎట్టి పరిస్థితులలో మత సమావేశాలలో పాల్గొన్నవారినందరినీ, వారి కుటుంబ సభ్యులందరినీ, వారు కలిసినవారినందరినీ గుర్తించి క్వారంటైన్‌ శిబిరాలకు తరలించవలసి ఉంటుంది. లేదా వారి తరలింపు పూర్తయ్యేవరకు దేశంలో లాక్‌డౌన్‌ పొడిగించవలసి ఉంటుంది. లేకుంటే భారత్‌లో కూడా అమెరికా, ఇటలీ,స్పెయిన్  దేశాల కంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవలసివస్తుంది. అటువంటి పరిస్థితులే దాపురిస్తే భారత్‌ తట్టుకోవడం చాలా కష్టం.

ఇంతవరకు కరోనా సోకినవారిపట్ల, ఆ లక్షణాలున్నవారి పట్ల ప్రభుత్వాలు చాలా మానవత్వంతో, సహనంతో వ్యవహరిస్తూ నచ్చచెప్పి ఆసుపత్రులకు...క్వారంటైన్‌ శిబిరాలకు తరలించేందుకు  ప్రయత్నిస్తున్నారు. కానీ నేటికీ కొంతమంది రహస్యంగా దాక్కొంటూ, తమను గుర్తించడానికి వస్తున్న ఆశావర్కర్లు, పోలీసులు, జిల్లా వైద్యఆరోగ్య సిబ్బందిపట్ల చాలా అనుచితంగా వ్యవహరిస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.  ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న ఆశావర్కర్లను నిర్బందించినట్లు, క్వారంటైన్‌ శిబిరాలలో...ఆసుపత్రులలో వైద్యులు, సిబ్బందితో అనుచితంగా, దురుసుగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే వారి చర్యలకు అర్ధం ఏమిటి?

ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు దేశ ఆర్ధిక వ్యవస్థను పణంగా పెట్టి 21 రోజులు లాక్‌డౌన్‌ అమలుచేసుకొంటున్నాము. కానీ అదంతా బూడిదలో పోసిన పన్నీరు కాకూడదనుకొంటే, 130 కోట్ల మంది దేశప్రజల హితం కొరకు ఇకపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అటువంటివారితో చట్టప్రకారం కటినంగా వ్యవహరించ తరుణం ఆసన్నమైంది. ప్రాణాంతకమైన కరోనా వైరస్ సోకినప్పటికీ బయటకు రాకుండా దాక్కొన్నవారు ఉద్దేశ్యపూర్వకంగానే ఇతరులకు కూడా వ్యాపింపజేయాలని ప్రయత్నిస్తున్నట్లుగానే భావించి అటువంటివారిపట్ల కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కటినంగా వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. భారత్‌ మరో అమెరికా, ఇటలీ, స్పెయిన్, జర్మనీ కాకూడదనుకుంటే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కటినమైన నిర్ణయాలు తీసుకోకతప్పదు.


Related Post