మోడీజీ...ఆ ప్రతిపాదనపై పునరాలోచించండి!

April 04, 2020


img

రేపు అంటే ఆదివారం రాత్రి  9 గంటల నుంచి 9 నిమిషాలసేపు దేశప్రజలందరూ తమ ఇళ్లలోని లైట్లు ఆర్పివేసి, ఇంటి బయట దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి కరోనాపై పోరాటానికి సంఘీభావం తెలియజేయాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దానిపై ప్రతిపక్ష నేతలు ఎలాగూ విమర్శిస్తారు. కానీ విద్యుత్ నిపుణులు, విద్యుత్ ఇంజనీర్లు కూడా ఈ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. 

లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో విద్యుత్ ఎక్కువగా వినియోగించుకొనే పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, వివిద సంస్థలు, విద్యుత్ రైళ్ళు, మెట్రో రైళ్లు అన్నీ నిలిచిపోయినందున దేశంలో విద్యుత్ వినియోగం కనిష్టస్థాయికి పడిపోయిందని, ఒకవేళ రేపు రాత్రి దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఒకేసారి 9 నిమిషాల సేపు ఇళ్ళలో  లైట్లు ఆర్పివేస్తే విద్యుత్ వినియోగం మరింత పడిపోతే విద్యుత్ గ్రిడ్స్ లో తీవ్ర సాంకేతికలోపాలు తలెత్తే ప్రమాదం ఉందని విద్యుత్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్న ఈ సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటిని సరిచేయడం చాలా కష్టమవుతుందని, సరిచేయడానికి కనీసం 12-16 గంటలు సమయం పడుతుందని విద్యుత్ నిపుణులు, విద్యుత్ ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు.   

మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి డాక్టర్ నితిన్ రావత్ ముంబైలో మీడియాతో మాట్లాడుతూ, “హటాత్తుగా విద్యుత్ వినియోగం తగ్గిపోవడం వలన విద్యుత్ గ్రిడ్స్ విఫలమైతే అత్యవసర సేవలకు కూడా ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ ప్రతిపాదనపై పునరాలోచన చేయవలసిందిగా ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.


Related Post