చైనాపై అమెరికా ఆగ్రహం...దేనికి?

April 03, 2020


img

వరల్డ్ మీటర్స్ తాజా సమాచారం ప్రకారం అమెరికాలో ఇప్పటి వరకు 2,45,380 కరోనా కేసులు నమోదు కాగా 6,095 మంది చనిపోయారు. గడిచిన 24 గంటలలో అమెరికాలో కొత్తగా 503 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 25 మంది చనిపోయారు.  

ఒకవైపు కరోనా మహమ్మారితో నానాటికీ పెరిగిపోతున్న కేసులు, మృతులు. మరోవైపు కరోనా వ్యాప్తిని అడ్డుకొనే ప్రయత్నంలో లాక్‌డౌన్‌ చేసుకోవడం వలన కంపెనీలు, వ్యాపార సంస్థలు మూతపడటంతో ఆర్ధికనష్టం... లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థ కూడా తలక్రిందులవుతోంది. 

కరోనా వలన ఇంత నష్టం జరుగుతున్నా సర్వసంపన్న, సర్వ శక్తివంతమైన అమెరికా కరోనాను అడ్డుకోలేకపోతోంది. దీంతో ట్రంప్ సర్కార్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. 

కనుక కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూనే, ఈ కరోనా మహమ్మారిని తమ దేశంపై రుద్ది ఇంత నష్టాన్ని కలుగజేసిన చైనాపై అమెరికా తీవ్ర ఆగ్రహంగా వ్యక్తం చేస్తోంది. ఈ ‘చైనీస్ వైరస్’ కరోనాను ప్రపంచదేశాలకు అంటగట్టిందని ట్రంప్ తన మనసులో మాటను చాలా స్పష్టంగానే చెప్పేశారు. 

ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ కూడా చైనాపై తీవ్ర ఆరోపణలు చేశారు. “1.5 బిలియన్ జనాభా ఉన్నా చైనాలో కేవలం 82,000 మందికి మాత్రమే కరోనా సోకిందని, వారిలో కేవలం 3,300 మంది మాత్రమే చనిపోయారంటూ చైనా చెపుతున్న లెక్కలు నమ్మశక్యంగా లేవు. చైనాకు ప్రపంచదేశాల శ్రేయస్సు కంటే తన పరువే ముఖ్యమని భావిస్తోంది. అందుకే కరోనా వైరస్‌ గురించి సకాలంలో ప్రపంచదేశాలను హెచ్చరించకుండా రహస్యంగా దాచిపెట్టింది. కరోనా కేసుల విషయంలో కూడా చైనా వాస్తవాలను కప్పిపుచ్చి ప్రపంచదేశాలను మభ్యపెడుతోంది. అది చెప్పే లెక్కలకు వాస్తవాలకు ఎక్కడ పొంతలేదని అమెరికా ఇంటలిజన్స్ చెప్పిన మాట నూటికి నూరుపాళ్ళు నిజమేనని భావిస్తున్నాను. తమ దేశం నుంచి పుట్టిన కరోనా వైరస్‌ వలన నష్టపోతున్న దేశాలకు సాయం చేయడం కంటే తద్వారా పేరుప్రతిష్టలను పెంచుకోవాలని చైనా ఆరాటపడుతోంది,” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అమెరికా ఆగ్రహం సహేతుకమే కానీ దాని ఆగ్రహానికి వేరే కారణాలు కూడా కనిపిస్తున్నాయి. మొదట్లో ట్రంప్ ప్రభుత్వం కరోనాను చాలా తేలికగా తీసుకొని నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలననే నేడు ఈ దుస్థితి వచ్చిందని ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా నిత్యం విమర్శిస్తూనే ఉంది. కరోనా వ్యాపించినా తరువాత దానిని కట్టడి చేయడంలో ట్రంప్ సర్కార్ ఘోరంగా విఫలమైందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఇటువంటి కీలక సమయంలో తీవ్ర ఒత్తిడి, తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్ సర్కార్, బహుశః చైనాను నిందించడం ద్వారా ప్రజాగ్రహాన్ని చైనాపైకి మళ్లించాలని ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. ఏది ఏమైనప్పటికీ వీలైనంత త్వరగా కరోనాకు కళ్ళెం వేయలేకపోతే ట్రంప్ పతనం కూడా ప్రారంభమవుతుంది. 


Related Post