నిరుపేదలకు అండగా తెలంగాణ పోలీస్..శభాష్..శభాష్...

April 03, 2020


img

లాక్‌డౌన్‌ సమయంలో బయటకు వచ్చినవారిపట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ కొందరు పోలీసులు తమ పోలీస్ శాఖకు చెడ్డపేరు తెస్తుంటే, మరికొందరు కరోనా పేషంట్లున్న గాంధీ ఆసుపత్రిలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తూ, లాక్‌డౌన్‌ కారణంగా ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలను ఆదుకొంటూ పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలుస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచుతున్నారు. 

లాక్‌డౌన్‌  కారణంగా ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు ఆహారం అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ వాట్సాప్‌లో 4906 17523 నెంబరుతో కొత్తగా ఓ గ్రూప్ క్రియేట్ చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచినవారు తమ వాట్సాప్‌ నెంబరును పైన పేర్కొన్న నెంబరుకు మెసేజ్ ద్వారా తెలియజేసి తమ వివరాలను నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఆ తరువాత రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా ఆకలితో అలమటిస్తున్న పేదలు కనిపిస్తే ఆ ప్రాంతంలో ఉన్న గ్రూప్ సభ్యులు లేదా పోలీసులు వారి ఫోటోలను, వారుంటున్న ప్రాంతాలను తెలియజేస్తూ గ్రూపులో పోస్ట్ చేయాలి. అప్పుడు వీలైతే సమీపంలో ఉన్న పోలీసులు లేదా గ్రూపులో పేర్లు నమోదు చేసుకొన్న వ్యక్తులు లేదా స్వచ్ఛందసంస్థలు ఎవరైనా వారికి ఆహారం లేదా రేషన్ సరుకులు అందించవచ్చు. కరోనా మహమ్మారిని ఓడించేందుకు మొదలుపెట్టిన ఈ పోరాటంలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వాములు కావాలని డిజిపి మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

ప్రస్తుతం జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్లు సైతం రూ.1.75 లక్షలతో పేదలకు నిత్యావసరసరకులను అందజేశారు.     


పేదలను ఆదుకోవడంలో సైబరాబాద్ పోలీసులు అందరికంటే ముందున్నారు. సైబరాబాద్ కమీషనరేట్ కింద ఉండే 36 పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్న నిరుపేదలకు రోజూ భోజనాల ప్యాకెట్లు అందజేస్తున్నారు. సైబరాబాద్ పోలీసులు గురువారం ఒక్కరోజే నగరంలో 13,620 మందికి ఆహారపు పొట్లాలు అందజేశారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో  సహా మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు తమకు ఈ కార్యక్రమంలో సహాయపడుతున్నాయని సిపి సజ్జనార్ తెలిపారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసే వరకు 36 పోలీస్‌స్టేషన్ల పరిధిలోని పేదలకు ఆహారపు పొట్లాలు, మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తామని సజ్జనార్ తెలిపారు. పోలీసులు అంటే నేర నియంత్రణ మాత్రమే కాదు కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడవచ్చని తెలంగాణ పోలీసులు నిరూపిస్తున్నారు. అందుకు వారందరికీ అభినందనలు.


Related Post