కరోనాపై పోరుకు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ 1,125కోట్లు విరాళం

April 02, 2020


img

దేశంలో బ్యాంకులకు వేలకోట్లు కుచ్చుటోపీలు పెట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటివారూ ఉన్నారు. ఇటువంటి క్లిష్టసమయంలో వేలకోట్లు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలుగా ప్రకటిస్తున్న గొప్ప  పారిశ్రామికవేత్తలు మన దేశంలో ఉన్నారు. అటువంటివారిలో విప్రో సంస్థల అధినేత అజీమ్ ప్రేమ్‌జీ ఎప్పుడూ  ముందు వరుసలో ఉంటారు. 

విప్రో లిమిటెడ్ రూ.100 కోట్లు, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ రూ.25 కోట్లు, విప్రో ఫౌండేషన్ రూ.1,000 కోట్లు కలిపి మొత్తం రూ.1,125 కోట్లు  కరోనాపై పోరాటానికి ఖర్చు చేయబోతున్నట్లు బుదవారం విపోరో ఫౌండేషన్ ప్రకటించింది. విప్రో ఫౌండేషన్ చేస్తున్న సామాజికసేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్న నిధులకు ఇది అదనమని ప్రకటించింది. 

కరోనా వైరస్‌పై ప్రత్యక్షపోరాటం చేస్తున్న వైద్యులకు, వైద్య సిబ్బందికి అవసరమైన రక్షణ, వైద్య పరికరాలను అందజేస్తామని విప్రో ఫౌండేషన్ ప్రకటించింది. దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనాను అంతమొందించేందుకు ఈ నిధులను వినియోగిస్తామని తెలిపింది. 

అంతేకాదు... అజీమ్ ప్రేమ్‌జీకి విప్రో సంస్థలలో గల వాటాలో సుమారు 34 శాతం అంటే రూ.52,750 కోట్లు సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారని విప్రో ఫౌండేషన్ తెలియజేసింది.

విజయవంతంగా వ్యాపారాలను నిర్వహిస్తూ లక్షల కోట్లు ఆస్తులు పోగేసుకొని ఫోర్బ్స్ పత్రికలో పేరు చూసుకోవాలనుకొనేవారు దేశంలో చాలా మందే ఉంటారు. కానీ సంపాదించిన దానిలో 34 శాతాన్ని తిరిగి సమాజశ్రేయస్సు కోసం ఇవ్వాలనుకునేవారు చాలా అరుదుగా కనబడతారు. అటువంటి గొప్ప వ్యక్తే అజీమ్ ప్రేమ్‌జీ.


Related Post