సంగారెడ్డిలో ఆరు కేసులు..కేరాఫ్ నిజాముద్దీన్

April 02, 2020


img

సంగారెడ్డి జిల్లాలో గురువారం కొత్తగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వారందరూ కూడా డిల్లీ, నిజాముద్దీన్‌ మతసమావేశాలకు హాజరైవచ్చినవారే. వారిలో ఇద్దరు సంగారెడ్డి పట్టణానికి చెందినవారు కాగా, ఇద్దరు శివారులో అంగడిపేట గ్రామానికి చెందినవారు. మిగిలిన ఇద్దరీలో ఒకరు జహీరాబాద్, కొండాపూర్ మండలాలకు చెందినవారు. ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలడంతో వారి కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు చేసి రిపోర్టులు వచ్చే వరకు ఇళ్లలోనే ఉండాల్సిందిగా జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు ఆదేశించారు. కరోనా సోకిన ఆరుగురినీ గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. 

జనగామ జిల్లాలో వెల్దండ గ్రామంలో కూడా నిజాముద్దీన్‌ మతసమావేశాలకు హాజరై వచ్చిన ముగ్గురికి, వారి ద్వారా మరో ఇద్దరికీ కరోనా సోకినట్లు అనుమానం కలగడంతో వారిని బుదవారం ఆసుపత్రులకు తరలించారు. జనగామ పట్టణంలో అంబేడ్కర్‌ నగర్‌లో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి కుమారుడు ఇటీవల డిల్లీకి వెల్లివచ్చినట్లు తెలియడంతో జిల్లా వైద్యాధికారులు అతనితో సహా వారి కుటుంబ సభ్యులందరినీ ప్రత్యేక అంబులెన్సులో సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు ముందు జాగ్రత్త చర్యగా జిల్లా అధికారులు వెల్దండకు చెందిన 54 మందిని జనగామ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటరుకు తరలించి వైద్య పరీక్షలు జరిపించారు. ఇక నుంచి జనగామ జిల్లాలోనికి బయట నుంచి ఎవరు వచ్చినా గుర్తించేందుకు స్థానిక ప్రజలతో కూడిన బృందాలు ఎక్కడికక్కడ కాపాలా కాస్తున్నారు. 

నల్గొండ జిల్లా నుంచి 18 మంది నిజాముద్దీన్‌ మతసమావేశాలలో పాల్గొని తిరిగివచ్చినట్లు తెలుసుకొన్న జిల్లా అధికారులు రెండు రోజుల క్రితం వారినందరినీ వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించి, వారి కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచారు. ఆ 18మందితో సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించేందుకు అధికారులు గాలిస్తున్నారు.                     

కరోనా సోకిన ఇండోనేషియావాసులు సంచరించిన కరీంనగర్‌ జిల్లాలోని ప్రాంతాలలో నివశిస్తున్నవారిని గత వారం రోజులుగా ఇళ్ళలో నుంచి బయటకు రాకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతాలలో వారందరికీ జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు బుదవారం ర్యాపిడ్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించగా ఎవరికీ కరోనా సోకలేదని నిర్ధారణ అయ్యింది.


Related Post