ముంబై, ధారావి మురికివాడలో కరోనా

April 02, 2020


img

ప్రస్తుతం దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. నేటి వరకు మహారాష్ట్రలో 335 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 13 మంది మరణించారు. దేశ ఆర్ధిక రాజధానిగా చెప్పుకోబడే ముంబై మహానగరానికి ఇప్పుడు మరో పెను ప్రమాదం పొంచి ఉంది. ఆసియా ఖండంలోకెల్లా రెండవ అతిపెద్ద మురికివాడ ధారావి ముంబైలోనే ఉంది. సుమారు 535 ఎకరాలలో విస్తరించి ఉన్న ఆ మురికివాడలో 10 లక్షల మందికిపైగా  నివసిస్తున్నట్లు అంచనా. ధారావిలో ఎక్కువగా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వలసలు వచ్చినవారు చిన్న చిన్న రేకుల షెడ్లలో నివాసం ఉంటారు. వారి ఇళ్ల మద్య ఏమాత్రం ఖాళీలేకుండా ఒకదానినొకటి ఆనుకొని ఉంటాయి. కనుక ధారావిలో కరోనా ప్రవేశించడం, వ్యాపించడం కూడా చాలా సులువే కానీ దానిని కట్టడి చేయడం చాలా చాలా కష్టం. 

అంత జనసాంద్రత ఉండే ధారావిలో నిన్న 56 ఏళ్ళ వ్యక్తి కరోనాతో చనిపోయాడు.  సమాచారం అందుకొన్న పోలీసులు, వైద్యారోగ్యశాఖ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని ఆ పరిసర ప్రాంతాలలో 308 ఇళ్ళు, 91 దుకాణాలు సీల్ చేసేశారు. కరోనాతో మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులను, పరిసర ప్రాంతాలలో ప్రజలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి, కరోనా లక్షణాలున్నవారినందరినీ క్వారంటైన్‌ శిబిరాలకు తరలించారు. చనిపోయిన వ్యక్తి ధారావిలోగల జామా మసీదులో ప్రార్ధనలలో పాల్గొన్నాడని తెలుసుకొన్న వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆ ప్రాంతంలోని ప్రజలకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. 

ధారావి నుంచి కూడా ఇద్దరు వ్యక్తులు డిల్లీ, నిజామాబాద్‌ తబ్లీగ్ జమాత్ సమావేశాలకు వెళ్ళివచ్చినట్లు సమాచారం అందడంతో వైద్య ఆరోగ్య సిబ్బంది, స్థానికుల సహాయంతో వారిరువురినీ గుర్తించి, వారిని ఆసుపత్రికి తరలించి వారి కుటుంబ సభ్యులందరికీ, పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు.

భారీ సంఖ్యలో మునిసిపల్ కార్పొరేషన్, ప్రజారోగ్య సిబ్బంది ధారవీ చేరుకొని ఆ ప్రాంతమంతా కీటకనాశిని మందులను పిచ్చికారి చేస్తున్నారు. ధారావిలో ఎవరూ కూడా ఇళ్ళలో నుంచి బయటకు రావద్దని, వారికి కావలసిన నిత్యావసరవస్తువులన్నీ ఇళ్ళకే తెచ్చి అందిస్తామని అధికారులు చెప్పారు. 

దేశంలో ధారావి అతిపెద్ద మురికివాడ కావచ్చు కానీ దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రంలో...ప్రతీ జిల్లాలోను చిన్నా పెద్దా మురికివాడలున్నాయి. వాటిలో నివశిస్తున్నవారందరూ ఇంచుమించు ఇటువంటి ప్రమాదమే ఎదుర్కొంటున్నారు. అటువంటి మురికివాడలలో ఒకసారి కరోనా మహమ్మారి ప్రవేశించిందంటే దానిని కట్టడి చేయడం చాలా కష్టం. కనుక అన్ని రాష్ట్రాలలో...జిల్లాలలో మునిసిపల్, ప్రజారోగ్య శాఖల అధికారులు మురికివాడలలో కరోనా ప్రవేశించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.


Related Post