ఈ సమయంలోనూ రాజకీయాలా?

April 02, 2020


img

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బుదవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “లాక్‌డౌన్‌కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తోంది. కానీ ఉద్యోగుల జీతాలలో కోతలు విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులకు పూర్తి జీతం చెల్లించాలని ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగుల జీతలలో ఎందుకు కోత విదించింది? ముఖ్యంగా క్లాస్-4, పదవీ విరమణ చేసినవారి పెన్షన్లలో కోత విదించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం పెరిగిందని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల లాక్‌డౌన్‌కే ఖజానా ఖాళీ అయిపోయిందని చెపుతూ ఉద్యోగుల జీతాలలో కోతలు విదించడం చాలా శోచనీయం. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా మహమ్మారితో పోరాడుతుంటే వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వకపోగా జీతాలు కత్తిరించడం సరికాదు. కనుక రాష్ట్ర ప్రభుత్వం తక్షణం నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని కోరుతున్నాను,” అని అన్నారు. 

తెలంగాణ రాష్ట్రం కరోనా మహమ్మారితో సతమతమవుతుంటే, కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండటం చాలా శోచనీయం. లాక్‌డౌన్‌ వలన దేశంలో అన్ని వ్యవస్థలు బంద్‌ అయిపోవడం వలన కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం కోల్పోతున్నాయనే సంగతి అందరికీ తెలుసు. ఏప్రిల్ 14వరకే లాక్‌డౌన్‌ అని కేంద్రప్రభుత్వం ప్రకటించినప్పటికీ, దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తుండటం వలన మరికొన్ని రోజులు లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక అంతవరకు రాష్ట్ర ఖజానాలో ఉన్న సొమ్మును చాలా పొదుపుగా వాడుకోవలసి ఉంటుంది. కాదని ఇప్పుడే పూర్తిగా ఖర్చు పెట్టేసుకొంటే ఆ తరువాత ఉద్యోగులకు అసలు జీతాలే చెల్లించలేని దుస్థితి ఏర్పడవచ్చు. అటువంటి దుస్థితి రాకూడదనే దూరదృష్టితోనే సిఎం కేసీఆర్‌ ఉద్యోగుల స్థాయిని బట్టి కొంత కోత విదించి, పరిస్థితులు చక్కబడగానే తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలోనే కాదు... దేశంలో చాలా రాష్ట్రాలలో ప్రభుత్యోద్యోగులకు జీతలలో కోతలు విధిస్తున్నాయి. 

జీతాలు, పెన్షన్లలో కోత విధించడం వలన ఉద్యోగులు, పెన్షనర్లు ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడవచ్చు కానీ రానున్న రోజులలో సకాలంలో జీతాలు అందుకోవాలంటే ఈ ఇబ్బందిని భరించక తప్పదని వారూ గ్రహించారు అందుకే ఎవరూ పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. ఇటువంటి కష్టకాలంలో కాంగ్రెస్‌ నేతలు ప్రభుత్వానికి సహకరించకపోయినా పరువాలేదు కానీ సమస్యలు సృష్టించకుండా ఉంటే చాలు.


Related Post