అప్పుడూ...ఇప్పుడూ మళ్ళీ అవే తప్పులు?

March 30, 2020


img

నాలుగేళ్ళ క్రితం పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు తగినన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వలన లేదా తదనంతర పరిణామలాను అంచనావేయడంలో కేంద్రప్రభుత్వం విఫలమవడం వలననో యావత్ దేశప్రజలు ఎన్ని కష్టానష్టాలు అనుభవించారో అందరికీ గుర్తుండే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు హటాత్తుగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఇంచుమించి అదే తప్పు మళ్ళీ చేసినట్లయింది. హటాత్తుగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఇతర రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాలకు వలసలు వచ్చిన వేలాదిమంది కార్మికులు, కూలీలు ఉపాది, ఆదాయం కోల్పోయి, నిలువనీడలేక భార్యాపిల్లలను వెంటబెట్టుకొని వందల కిమీ దూరంలో ఉండే తమ రాష్ట్రాలకు కాలినడకన నడుచుకొంటూపోతున్నారు. చంటిపిల్లలను వేసుకొని వందల కిలోమీటర్లు నడకకు సిద్దపడటం మొదట్లో సంచలన వార్త అయ్యింది. కానీ ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా రోడ్లపై కాలినడకన సాగిపోతున్న నిరుపేదలే కనిపిస్తున్నారు.  దాంతో ఇది కూడా సామాన్యమైన వార్తగా మారిపోయింది! 

దారిలో తినేందుకు ఆహారం, త్రాగేందుకు గుక్కెడు మంచి నీళ్ళుకూడాలభించడంలేదు. అలాగే మండుతున్న ఎండల్లో పడి చిన్న చిన్న పిల్లలను వెంటేసుకొని భారంగా నడుచుకుపోతున్నారు. కరోనా భయంతో ఎవరూ వారికి సహాయపడేందుకు జంకుతుంటే, లాక్‌డౌన్‌ కారణంగా పోలీసులు వారిని అడ్డుకోవలసివస్తోంది. దాంతో వారందరూ అష్టకష్టాలు పడుతున్నారు. అక్కడక్కడ కొన్ని గ్రామాలలో ప్రజలో లేదా రోడ్లపై పహారా కాస్తున్న పోలీసులే సానుభూతితో వారికి ఆహారం, మంచినీళ్లు అందించి ఆదుకొంటున్నారు.

ప్రధాని నరేంద్రమోడీ నిన్న రేడియో ద్వారా ‘మన్ కీ బాత్‌’ (మనసులో మాట) కార్యక్రమంలో దేశప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “లాక్‌డౌన్‌తో ఇబ్బందిపెడుతున్నందుకు దేశప్రజలు నన్ను క్షమించాలని కోరుతున్నాను. ప్రజల ప్రాణాలు కాపాడటం కోసమే ఇంత కటినమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని మీ అందరికీ తెలుసు కనుక సహృదయంతో నన్ను అర్ధం చేసుకొంటారని ఆశిస్తున్నాను,” అని అన్నారు. 

హటాత్తుగా లాక్‌డౌన్‌ ప్రకటిస్తే ఈవిధంగా వేలాదిమంది నిరుపేదలు రోడ్లపై అష్టకష్టాలుపడతారని కేంద్రప్రభుత్వం ఊహించకపోవడం పెద్ద తప్పేనని చెప్పాలి. ఆ తప్పును సరిదిద్దుకొనే అవకాశం కూడా ఉంది కానీ తగిన చర్యలు చేపట్టకపోవడం వలన అన్నివేలమంది పేదలు ముఖ్యంగా ...మహిళలు, చిన్న పిల్లలు నానా కష్టాలు అనుభవిస్తున్నారు. 

“విదేశాలలో చిక్కుకుపోయిన వారి కోసం ప్రత్యేక విమానాలు పంపించిన కేంద్రప్రభుత్వం దేశంలో నడిరోడ్లపై ఉన్న మమ్మల్ని మా సొంత ఊళ్ళకు చేర్చలేదా?” అనే వారి ప్రశ్నకు ఎవరు సమాధానం చెపుతారు? 

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి లాక్‌డౌన్‌ తప్ప వేరే మార్గం లేదని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే చెపుతున్నప్పుడు రోడ్లపై అన్ని వేలమంది గుంపులు గుంపులుగా సాగిపోతుంటే వారిని క్వారంటైన్‌కు ఎందుకు తరలించడం లేదు?ఒకవేళ అదీ సాధ్యంకాకపోతే ఎక్కడికక్కడ ఖాళీగాఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కాలేజీ భవనాలలో వారికి ఓ రెండు వారాలపాటు ఆశ్రయం కల్పించి ఆహారం అందించవచ్చు కదా? కార్పొరేట్ సంస్థలు, నిత్యాన్నదానాలు చేసే పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు, స్వచ్చందసంస్థలు, ప్రభుత్వాలు పూనుకొంటే ఆ నిరుపేదలకు ఓ 2 వారాలు ఆశ్రయం కల్పించి ఆహారం అందించడం కష్టమా?


Related Post