లాక్‌డౌన్‌ తొలగించవచ్చు కానీ...

March 30, 2020


img

ఏప్రిల్ 14వరకు దేశమంతా లాక్‌డౌన్‌లో ఉంటుంది. దేశాన్ని కరోనా కబళించకుండా ఉండాలంటే ఆ తరువాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించవలసి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే లాక్‌డౌన్‌ ఇంకా ఎక్కువ రోజులు కొనసాగిస్తే దేశఆర్ధిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంటుందని అందరికీ తెలుసు. ఈ పరిస్థితులలో లాక్‌డౌన్‌ లేకుండా కరోనాను ఏవిధంగా కట్టడి చేయాలి? అని ఆలోచిస్తే కొన్ని మార్గాలు కనిపిస్తున్నాయి. 

గతంలో పెద్దనోట్లు రద్దు చేసినప్పుడు దేశంలో నగదు కొరత ఏర్పడటంతో అందరూ నగదురహిత లావాదేవీలు, ఆన్‌లైన్‌ లావాదేవీలతో ఆ సమస్యను కొంతవరకు అధిగమించారు. ఇప్పుడు దేశంలో నిత్యావసర సరుకులకు కొరత లేదు. ఇప్పటికే బిగ్‌బాస్కెట్, స్పెన్సర్స్, డీమార్ట్, గ్రోఫర్స్, అమెజాన్ వంటి సంస్థలు వాటిని ప్రజల ఇళ్ళవద్దకే చేరవేస్తున్నాయి. కనుక కరోనా వ్యాపించకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ మరిన్ని సంస్థలను ఆవిధంగా నిత్యావసరవస్తువుల సరఫరాకు అనుమతించవచ్చు. అలాగే కొంతకాలం పాటు విద్యార్ధులకు ఆన్‌లైన్‌ తరగతులు, పరీక్షలు నిర్వహించవచ్చు.    

అయితే నిత్యావసరవస్తువులను చేరవేయడం ఒకటే ఈ సమస్యకు పరిష్కారం కాదు. అన్ని రంగాలు వీలైనంత త్వరగా మళ్ళీ పనిచేయాల్సి ఉంటుంది. కనుక కరోనా నేపద్యంలో ప్రతీ రంగానికి వేర్వేరుగా నిర్ధిష్టమైన మార్గదర్శకాలు, నియమనిబందనలు, ఆంక్షలు, పరిమితులు రూపొందించగలిగితే అన్ని వ్యవస్థలు పూర్తిగా కాకపోయినా పాక్షికంగానైనా పనిచేయడం ప్రారంభిస్తాయి. అప్పుడు దేశం ఆర్ధికమాంద్యంలో కూరుకుపోకుండా తప్పించుకోవచ్చు. 

కరోనా వైరస్‌కు మందులను కనుగొనేవరకు దాని వ్యాప్తిని అడ్డుకోవడమే ఏకైక మార్గం. కనుక అంతవరకు కరోనా కోసం ప్రత్యేక వ్యవస్థలనే ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం. ప్రపంచడం నుంచి కరోనా పూర్తిగా తొలగిపోయేవరకు, అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు విధించకతప్పదు. లాక్‌డౌన్‌ ఎత్తివేసినప్పటికీ ప్రజల కదలికలపై ఆంక్షలు విధించక తప్పదు. సినిమా హాల్స్, ప్రజారవాణా, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, మార్కెట్లు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు... ఇలా ప్రతీ వ్యవస్థలో కూడా కరోనా వ్యాపించకుండా అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు, అవసరమైతే మార్పులు చేర్పులు చేసుకోవలసి ఉంటుంది. బస్సులతో సహా ప్రతీచోట ఎక్కడికక్కడ చేతులు కడుక్కోవడానికి నీళ్లు, సబ్బులు, డిస్పోజబుల్ న్యాప్కిన్స్, మాస్కూలు, గ్లౌజులు తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. వాటి వినియోగం తప్పనిసరి చేయాలి. 

కరోనా బెడద ఇంకా ఎప్పటికీ తొలగిపోతుందో ఎవరికీ తెలీదు కనుక అంతవరకు చేతులు ముడుచుకొని కూర్చొని చేజేతులా మరో కొత్త సమస్యను ఆహ్వానించడం కంటే కరోనా సోకకుండా దేశంలో అన్ని వ్యవస్థలను మళ్ళీ ఏవిధంగా నడిపించుకోవాలి? అని ఆలోచిస్తే మంచిది లేకుంటే కరోనా మరణాల కంటే దేశంలో ఆకలిచావులు పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. 


Related Post