లాక్‌డౌన్‌ తరువాత ఏమిటి?

March 25, 2020


img

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం 21 రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించి అమలుచేస్తోంది. కరోనా గొలుసును చేదించాలంటే ఈ బాధలు, నిర్బందం తప్పవు. అయితే 21 రోజులలో కరోనా వైరస్‌ ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందా? 21 రోజులు పూర్తికాగానే లాక్‌డౌన్‌ ఎత్తేస్తారా? అనే ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేరు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఇంతకు మించి వేరే మార్గం లేదని చైనా నిరూపించి చూపించింది కనుక భారత్‌లో లాక్‌డౌన్‌ వల్ల కూడా సత్ఫలితాలు వస్తాయని ఆశించవచ్చు. 

కరోనా పుట్టిన వూహాన్ నగరంలో సుమారు రెండు నెలలకు పైగా చైనా ప్రభుత్వం ఇంతకంటే చాలా కటినంగా లాక్‌డౌన్‌ అమలుచేయడం వలననే కరోనాకు బ్రేకులు పడ్డాయి. కానీ భారత్‌లో ఏదో ఒక రాష్ట్రానికో నగరానికో కరోనా పరిమితం కాలేదు. యావత్ దేశమంతా వ్యాపించింది. ఈ 21 రోజుల లాక్‌డౌన్‌ వలన దేశంలో కరోనా వ్యాప్తి నిలిచిపోయినా ఆ తరువాత మళ్ళీ ప్రజలందరూ బహిరంగప్రదేశాలలో గుమిగూడటం మొదలుపెడితే సమస్య మొదటికి రావచ్చు. కనుక మరో రెండు నెలలు ఇంకా కటినంగా లాక్‌డౌన్‌ అమలుచేయవలసి రావచ్చు. ఆ తరువాత కూడా మరో 6-12 నెలలపాటు ప్రజల కదలికలపై ఆంక్షలు విధించవలసిరావచ్చు. 

కనుక లాక్‌డౌన్‌ తరువాత ఏవిధంగా వ్యవహరించాలి? ఎటువంటి ఏర్పాట్లు చేయాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ లాక్‌డౌన్‌ కారణంగా గాడి తప్పబోతున్న దేశఆర్ధికను మళ్ళీ ఏవిధంగా గాడిన పెట్టాలి? దాని కోసం ఎటువంటి చర్యలు చేపట్టాలి?అనే అంశాలపై కూడా ఇప్పుడే చాలా లోతుగా ఆలోచించి అవసరమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. 

ఇక లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగాలు, ఉపాధి కోల్పోతున్న వారిని ఆదుకోవలసిన బాధ్యత కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది. కానీ లాక్‌డౌన్‌ వలన రోజూ వేలకోట్లు ఆదాయం కోల్పోతున్న కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నిసహాయులైన ప్రజలను ఆదుకొంటాయా లేదా? అనేది త్వరలోనే తెలుస్తుంది. ఇప్పుడు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఆదుకొంటేనే ఒకవేళ లాక్‌డౌన్‌ను పొడిగించినా అందరూ ప్రభుత్వానికి సహకరిస్తారు. లేకుంటే ప్రజలను ఒప్పించడం లేదా ఇళ్ళలోనే నిర్బందించడం కష్టం కావచ్చు. 


Related Post