గుండెపోటుతో వ్యక్తి మృతి..కరోనా భయంతో జనాలు పరుగు!

March 25, 2020


img

కరీంనగర్‌లో కాశ్మీర్ గడ్డ వద్దగల రైతుబజారులో ఈరోజు ఉదయం ఓ విషాదఘటన జరిగింది. రైతుబజారులో కూరగాయలు కొనుకొనేందుకు వచ్చిన ఒక వ్యక్తి హటాత్తుగా కుప్పకూలిపోవడంతో అతని సమీపంలో ఉన్న ప్రజలు కరోనా భయంతో అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు. ఈ సమాచారం అందుకొన్న పోలీసులు అంబులెన్స్ తో అక్కడికి చేరుకొన్నారు. కానీ ఆ వ్యక్తి అప్పటికే మరణించాడు. అతను గుండెపోటుతో మరణించాడని కరోనా వల్ల కాదని వైద్యులు చెప్పారు. 

అతను సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ కు చెందిన కొప్పుల వెంకటేష్ (55)గా పోలీసులు గుర్తించారు. అతను స్థానిక భగత్ నగర్ లో ఒక అద్దె ఇంట్లో తన భార్య ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటున్నాడు. మంకమ్మతోటలో గల ఓ స్టీల్ సామాను అమ్మే దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. 

ఇటీవల కరీంనగర్‌లో పర్యటించిన కొందరు ఇండోనేషియావాసులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అవడంతో జిల్లాలో ప్రజలు భయంభయంగా జీవిస్తున్నారు. అందుకే కళ్లెదుట ఓ వ్యక్తి గుండెపోటుతో మరణిస్తున్నప్పటికీ అతనిని ఆదుకొనే ప్రయత్నం చేయలేదు. వూహన్ నగరంలో కరోనా వైరస్ విజృంభించి విలయతాండవం చేస్తున్నప్పుడు అక్కడ రోడ్డుపై ఇదేవిధంగా ఓ వ్యక్తి కరోనా వైరస్‌ సోకి మరణించిన ఫోటో అందరూ చూసే ఉంటారు. ఇప్పుడు కరీంనగర్‌లోనే  గుండెపోటుతో చనిపోయిన వ్యక్తిని చూసి ప్రజలు భయంతో దూరంగా వెళ్లిపోవడం గమనిస్తే రానున్న రోజులలో దేశంలో ఎక్కడ ఎవరు ఏమాత్రం అనారోగ్యంతో ఉన్నా వారికి సమాజంలో ఇటువంటి చేదు అనుభవాలే ఎదురయ్యే అవకాశాలున్నాయని భావించవచ్చు. కనుక ఈ మూడు వారాలు అందరూ వీలైనంతవరకు ఇళ్ళలోనే ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది.


Related Post