అమెరికాలో కరోనా విలయతాండవం

March 25, 2020


img

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కుటుంబ సభ్యులు గత నెల భారత్‌ పర్యటనకు వచ్చినప్పటికే చైనాలో వూహాన్ నగరం కరోనాపై పోరాడుతోంది. కానీ భారత్‌, అమెరికా దేశాలు అప్పటికీ కరోనా తీవ్రతను, దాని విపరీత పర్యవసనాలను గుర్తించలేదనే చెప్పవచ్చు.అందుకే ట్రంప్ కుటుంబ సభ్యులు భారత్ వచ్చినప్పుడు భారత ప్రభుత్వం వారికి లక్షమందితో మోతేరా స్టేడియంలో ఘనస్వాగతం పలికింది.

 

కానీ ఆ తరువాత రెండు వారాలకే రెండు దేశాలలో పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ప్రపంచదేశాలతో పాటు భారత్‌, అమెరికాలు కరోనా వైరస్‌తో పెద్ద యుద్ధమే చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం భారత్‌లో ఇప్పటివరకు 562 కరోనా కేసులు నమోదు కాగా వారిలో 41 మంది కోలుకొంటున్నారు. ఇప్పటివరకు 11 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. 

ఇక ఆర్ధికంగా, సాంకేతికంగా, విద్యా వైద్యపరంగా ఏవిధంగా చూసిన ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా నిలుస్తున్న అమెరికా కూడా ఇప్పుడు మిగిలిన దేశాలలాగే కరోనా దెబ్బకు విలవిలలాడుతోంది. మంగళవారం ఒక్కరోజే అమెరికావ్యాప్తంగా సుమారు 10,000 కొత్త కేసులు నమోదు కావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 54,000కు చేరింది. దాంతో కరోనా మరణాలు కూడా పెరిగాయి. మంగళవారం ఒక్కరోజునే అమెరికాలో 150 మంది కరోనాతో చనిపోయారు. దాంతో ఇప్పటివరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 775కు చేరుకొంది. 


రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో అమెరికా ప్రభుత్వం, ప్రజలు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ 12న ఈస్టర్ పండుగ సమయానికి అమెరికాలో సాధారణ పరిస్థితులు నెలకొల్పాలనే లక్ష్యంతో అమెరికా ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. కానీ ఇంత వేగంగా కరోనా కేసులు నమోదు అవుతుండటం చూస్తుంటే అది సాధ్యమేనా? అని సందేహం కలుగుతోంది. Related Post