కరోనాకు శాశ్విత ఏర్పాట్లు అవసరమా?

March 25, 2020


img

ప్రస్తుతం విదేశాల నుంచి విమానాల రాక నిలిచిపోయింది కనుక విదేశాల నుంచి దేశంలోకి కరోనా ప్రవేశించే అవకాశం లేదు. అలాగే దేశంలో బస్సులు, రైళ్లు, విమానాలు అన్నీ బంద్‌ అయ్యాయి కనుక ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి కరోనా వ్యాపించే అవకాశం కూడా లేదు. కనుక ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాలలో ఉన్న కరోనా రోగులను ఆసుపత్రులలో చేర్చి, కరోనా లక్షణాలున్నవారిని బయట తిరగనీయకుండా కట్టడి చేయగలిగితే కరోనా బెడద తొలగిపోతుంది. 

కానీ కరోనా సోకినవారికి మొదట్లో సాధారణ జలుబు, దగ్గు వంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. విదేశాల నుంచి వస్తున్న విద్యాధికులే కరోనా లక్షణాలను గుర్తించలేక యాదేచ్చగా తిరిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక దేశంలో మారుమూల ప్రాంతాలలో నివసించే ఆదివాసీలు, గ్రామీణ ప్రజలు, నిరక్షరాస్యులు, నిరుపేదలు కరోనాను గుర్తించడం సాధ్యమేనా? అంటే కాదనే అర్ధమవుతోంది. కనుక మారుమూల గ్రామాలలో ఎవరికైనా కరోనా సోకినట్లయితే వారి ద్వారా దేశంలోకి మళ్ళీ మళ్ళీ కరోనా వస్తూనే ఉండవచ్చు. కనుక 21 రోజుల లాక్‌డౌన్‌ చేసినంతమాత్రన్న కరోనా భూతాన్ని మట్టుబెట్టడం సాధ్యం కాకపోవచ్చు. కనుక దేశంలో 130 కోట్ల మంది ప్రజలలో ఏ ఒక్కరికీ కరోనా లక్షణాలు కూడా లేవని నిర్దారించుకోవలసిన అవసరం చాలా ఉంది. అయితే 130 కోట్ల మందిని పరీక్షించడం, వారిలో కరోనా రోగులను గుర్తించడం దాదాపు అసంభవమే కనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్య పరిష్కారానికి మార్గాలు ఆన్వేషించవలసి ఉంటుంది.        

ఇక కరోనాను వదిలించుకొన్న తరువాత కూడా మళ్ళీ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కనుక దానిని అడ్డుకోవడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు శాస్వితప్రాతిపదికన అవసరమైన సిబ్బందిని నియమించుకొని వారికి తగిన శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇకపై కరోనా ఆసుపత్రులు, మందులు, వైద్య పరికరాలు ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉంటుంది. అవసరమైతే కరోనా నియంత్రణ కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు  ప్రత్యేక నియమనిబందనలు, చట్టాలు చేయవలసి ఉంటుంది. అప్పుడే కరోనా వైరస్‌ నుంచి దేశానికి పూర్తి విముక్తి లభిస్తుంది. బహుశః మరొక ఏడాదిపాటు ప్రపంచదేశాలన్నీ ఖచ్చితంగా ఇన్ని జాగ్రత్తలు తీసుకొంటేనే కరోనా పీడ శాస్వితంగా విరగడ అవుతుంది. లేకుంటే కరోనా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది.


Related Post