కరోనా నేపధ్యంలో ఉగాది పండుగ!

March 25, 2020


img

నేడు ఉగాది పండుగ. నేటి నుంచి శ్రీ శార్వారి నామ సంవత్సరం మొదలవుతుంది. గత ఏడాది అంటే వికారినామ సంవత్సరం ఇంచుమించు బాగానే గడిచిపోయిందనుకుంటే చైనా దేశం ప్రపంచానికి కరోనా మహమ్మారిని అంటగట్టడంతో లక్షలాదిమంది ప్రజలు కరోనా వైరస్‌ బారిన పడ్డారు ఇంకా పడుతూనే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వేలాదిమంది చనిపోయారు ఇంకా చనిపోతూనే ఉన్నారు. కనుక కరోనా మహమ్మారిని వెంటబెట్టుకొని నేడు మనమందరం కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్నాము. ఉగాది పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ, మా పాఠకులకు, మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ మైతెలంగాణ.కాం శుభాకాంక్షలు తెలియజేస్తోంది. 

భారత్‌తో సహా యావత్ ప్రపంచదేశాలు కరోనాతో విలవిలలాడుతున్న సమయంలో నేడు మనం ఈ ఉగాది పండుగ జరుపుకొంటున్నాము. ఉగాది పచ్చడి లేని ఉగాది ఉండదు. ఔషద గుణాలున్న వేపపువ్వు, మామిడిముక్కలు, బెల్లం, చెరుకు, అరటిపండు వగైరాలను కలిపి ఉగాది పచ్చడిని తయారుచేసుకొంటాము కనుక ఉగాదిపచ్చడి తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.       

మన పూర్వీకులు ఏవిధంగా లెక్కగట్టి తెలుగు సంవత్సరాలకు ఇటువంటి పేర్లు పెట్టారో తెలీదు కానీ వారు జరుగబోయే ఈ పరిణామాలను ముందే కనుగొని ఈ పేర్లు పెట్టినట్లు ఇప్పుడు అర్ధం అవుతోంది. నేటి నుంచి ప్రారంభం అయ్యే శార్వరినామ సంవత్సరంలో శార్వరికి పలు అర్ధాలున్నాయి. ఒకటి ‘శుభకరి’ అని కాగా మరొకటి అందుకు పూర్తి భిన్నంగా ‘కాళరాత్రి’ అనే అర్ధం కూడా ఉంది. శార్వరి అంటే అమ్మవారి పేరు అని అందరికీ తెలుసు. కనుక అమ్మవారిని ప్రార్ధిస్తూ కాళరాత్రిని శుభకరంగా మార్చుకొనే ప్రయత్నం చేద్దాం. 

మానవ ప్రయత్నం లేకపోతే ఆ దేవుడు కూడా తోడ్పడడని పెద్దలు చెప్పారు కనుక దేశప్రజలందరూ కరోనా వైరస్‌ సోకకుండా ఇళ్లలోనే ఉంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నట్లు తగు జాగ్రత్తలు పాటిస్తే ఈ నూతన సంవత్సరం ‘శుభకరం’గా మారుతుంది. కాదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ‘కాళరాత్రి’గా మారుతుంది. కనుక ఈ శార్వరినామ సంవత్సరం ఏవిధంగా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి. 

కరోనా మహమ్మారి మన గుమ్మం బయట నిలబడి ఉండగా ఈవిధంగా నూతన సంవత్సరం జరుపుకోవలసిరావడం చాలా విచిత్రంగానే ఉంది. కానీ తప్పదు ధైర్యంగా.. అప్రమత్తంగా ముందుకు సాగాల్సిందే. అలా సాగితే తప్పకుండా ఈ సంవత్సరం శుభకరిగానే ఉంటుంది. 

ఉగాది పండుగ సందర్భంగా అందరికీ మైతెలంగాణ.కాం మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తోంది.


Related Post