కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు ఏమి చేస్తున్నారు? కేసీఆర్‌ ప్రశ్న

March 24, 2020


img

సిఎం కేసీఆర్‌ మంగళవారం ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొనేందుకు రాష్ట్రంలో పోలీసులు, ఆరోగ్యశాఖ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు, రవాణాశాఖ ఉద్యోగులు అధికారులు అందరూ రోడ్లపైకి వచ్చి రేయింబవళ్లు పనిచేస్తున్నారు. కానీ మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ ఏం చేస్తున్నారు?అలాగే స్థానిక సంస్థల సభ్యులను, రైతుబందు సమితి సభ్యులను కూడా కలిపితే సుమారు 10 లక్షల సైన్యం అవుతుంది. రేపటి నుంచి అందరూ కూడా తమ తమ నియోజకవర్గం, జిల్లా, మండలం, గ్రామాలలో పోలీసులు, మునిసిపల్, ఆరోగ్యశాఖ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పనిచేయాలి. ఈ కష్టకాలంలో ప్రజలకు మేమున్నామని భరోసా కల్పించాలి. కరోనా వైరస్‌ గురించి ప్రజలలో చైతన్యం కలిగించాలి. ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గ్రామ పంచాయతీ వరకు అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే కరోనాను అడ్డుకోగలుగుతాము. 

ప్రస్తుతం దేశాన్ని, రాష్ట్రాన్ని లాక్‌డౌన్‌తో దిగ్బందనం చేశాము కనుక రాష్ట్రంలోకి కొత్తగా కరోనా రోగులు ప్రవేశించలేరు. కనుక ఇప్పటికే రాష్ట్రంలో ప్రవేశించినవారిని కట్టడి చేయగలిగితే కరోనా వ్యాప్తి ఆగిపోతుంది. కరోనా మహమ్మారిని తరిమికొట్టే వరకు మనం పోరాటం ఆపకూడదు. ఆపితే మళ్ళీ పుట్టుకువస్తుంది. కనుక ఇకపై మరింత కటినంగానే వ్యవహరించాలని నిర్ణయించుకున్నాము. 

రాష్ట్రసరిహద్దులలో అనేకవాహనాలు నిలిచిపోయాయి. వాటిలో కొన్ని రాష్ట్రానికి కావలసిన నిత్యావసర సరుకులను తీసుకురాగా మరికొన్ని రాష్ట్రం మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళవలసి ఉంది. కనుక వాటన్నిటినీ ఈరోజు రాత్రి తమ గమ్యస్థానాలవైపు వెళ్ళేందుకు అనుమతిస్తాము,” అని చెప్పారు.


Related Post