నేడు భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందాలు జరిగేనా?

February 25, 2020


img

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, సతీమణి మెలానియా ట్రంప్ కొద్దిసేపటి క్రితం డిల్లీలోని హైదరాబాద్‌ హౌస్ చేరుకున్నారు. ఈరోజు ఉదయం వారిరువురూ మౌర్యా షెర్టన్ హోటల్ నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్ చేరుకొన్నారు. అక్కడ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వారివురికీ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు హోదాలో డొనాల్డ్ ట్రంప్‌ రాష్ట్రపతి భవన్ వద్ద త్రివిదదళాల గౌరవ వందనం అందుకున్నారు. ఆ తరువాత ట్రంప్ దంపతులు రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి వారిరువురూ నేరుగా హైదరాబాద్‌ హౌస్ చేరుకున్నారు. అక్కడ వారి కోసం ఎదురుచూస్తున్న ప్రధాని నరేంద్రమోడీ వారిని సాదరంగా ఆహ్వానించారు. 

ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటల వరకు మోడీ-ట్రంప్ ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. అనంతరం వారిరువురూ సంయుక్త ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా భారత్‌, అమెరికా మీడియా ప్రతినిధులు అడిగే చెరో మూడు ప్రశ్నలకు వారిరువురూ సమాధానాలు చెపుతారు. 

ఈరోజు జరుగబోయే డిల్లీలో సమావేశంలో భారత్‌తో $3 బిలియన్ల విలువైన రక్షణ ఒప్పందాలు చేసుకొంటామని డొనాల్డ్ ట్రంప్ నిన్ననే ప్రకటించారు. కనుక అవి లాంఛనప్రాయమేనని చెప్పవచ్చు. కానీ వాణిజ్యపరమైన అంశాలపై భారత్‌ వైఖరిని డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా తప్పుపడుతున్నారు. అమెరికా నుంచి భారత్‌కు బయలుదేరే ముందు ‘గుడ్ డీల్ ఆర్‌ నో డీల్’ అంటూ ట్రంప్ తమ వైఖరిని ముందే చెప్పారు. ఈరోజు వాణిజ్యపరమైన అంశాలపై జరుగబోయే ద్వైపాక్షిక చర్చలు చాలా ‘టఫ్’గా ఉండబోతున్నాయని డొనాల్డ్ ట్రంప్ నిన్ననే మోతెరా స్టేడియంలో చెప్పారు. కనుక ఇరుదేశాల మద్య వాణిజ్యపరమైన అంశాలపై ఒప్పందాలు జరిగే అవకాశాలు తక్కువేనని భావించవచ్చు.


Related Post