వాడికి ఉరిశిక్ష ఖరారు

February 25, 2020


img

చిత్తూరు నగరంలో 5 ఏళ్ళ చిన్నారిని రేప్ చేసి హత్య చేసిన మహ్మద్ రఫీకి ఉరిశిక్ష పడింది. గత ఏడాది నవంబర్‌లో చిత్తూరులో ఓ కళ్యాణమండపంలో ఓ పెళ్ళి జరిగింది. దానికి తల్లితండ్రులతో కలిసి వెళ్ళిన ఓ 5 ఏళ్ళ చిన్నారి కూడా వెళ్లింది. ఆమె అక్కడ తోటిపిల్లలతో కలిసి ఆడుకొంటుండగా మహ్మద్ రఫీ అనే లారీ డ్రైవర్ ఐస్ క్రీమ్ తినిపిస్తానని ఆశపెట్టి, కళ్యాణమండపంలో బాత్రూములోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఆ పాప గొంతు నులిమి చంపేసి కళ్యాణమండపం ప్రహారీగోడపై బయటకు విసిరేసి వెళ్లిపోయాడు. పాప కనిపించకపోవడంతో కంగారుపడిన తల్లితండ్రులు, బందువులు చుట్టుపక్కల వెతికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కూడా వచ్చి గాలించగా, ప్రహరీగోడ పక్కన పాప మృతదేహం కనిపించింది. 

పోలీసులు కేసు నమోదు చేసుకొని సిసిటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి, ఆ దారుణానికి పాల్పడినవ్యక్తి మదనపల్లెలోని బసినికొండకు చెందిన మహ్మద్‌ రఫీ (25) అనే లారీ డ్రైవర్ అని గుర్తించారు. పోలీసు బృందాలు గాలించి చివరికి అతనిని పట్టుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు చిత్తూరులో ఏర్పాటైన ఫాస్ట్-ట్రాక్ కోర్టు రెండున్నర నెలలలో విచారణ అంతా పూర్తిచేసి మహ్మద్ రఫీ దోషి అని నిర్ధారించి ఉరిశిక్ష విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. 

ఈ కేసు విచారణలో మరో కొత్త విషయం కూడా బయటపడింది. రఫీ తన 15వ ఏటనే ఓ బాలికపై అత్యాచారం చేయగా అప్పటికి అతను మైనర్ కావడంతో చట్టప్రకారం కొన్నేళ్ళు జువైనల్ హోమ్‌లో ఉంచి వదిలేశారు. అప్పటి నుంచి అతనిలో ఆ నేరప్రవృత్తి అలాగే ఉండటంతో మళ్ళీ పదేళ్ళ తరువాత మరో చిన్నారిని చిదిమేశాడు. 

అత్యాచారకేసుల విచారణకు ఇప్పుడు ఫాస్ట్-ట్రాక్ కోర్టులు ఏర్పాటవుతుండటం, అవి వేగంగా విచారణ పూర్తి చేసి దోషులకు ఉరిశిక్షలు విధిస్తుండటం చాలా మంచి పరిణామమే. తద్వారా ఇటువంటి హేయమైన నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష పడుతుందనే భయం నేరస్తులలో కలిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ కేసు విచారణలో బయటపడ్డ మరో నేరం అందరూ ఆలోచించవలసిన అవసరం ఉందని గుర్తు చేసింది. మైనర్లుగా ఉన్నప్పుడే ఇటువంటి హేయమైన నేరాలకు పాల్పడి జువైనల్ హోమ్‌లకు వెళ్ళి బయటకువస్తున్న బాలనేరస్తులపై కూడా పోలీసులు నిరంతరం నిఘా ఉంచవలసిన అవసరం ఉందని ఈ కేసు ద్వారా స్పష్టం అయ్యింది.

నిర్భయ కేసులో దోషిగా నిర్ధారించబడిన ఓ మైనర్‌ను కూడా ఇలాగే మూడేళ్ళు జువైనల్ హోమ్‌లో ఉంచి విడుదల చేశారు. అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో... ఏమి చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. కానీ అతను కూడా మళ్ళీ ఇటువంటి నేరానికి పాల్పడితే మరో యువతి బలైపోతుంది కదా?


Related Post