ప్రజలే నాకు మంత్రి పదవి ఇచ్చారు: ఈటల రాజేందర్‌

February 24, 2020


img

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మనసులో ఏముందో తెలీదు కానీ అప్పుడప్పుడు ఆయన మాటలలో ఏదో అసంతృప్తి లేదా ధిక్కారస్వరం వినిపిస్తుంటుంది. హుజూరాబాద్‌లో నేడు పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభిస్తూ ఆయన, “నాకు మంత్రి పదవి మా అమ్మ ఇవ్వలేదు... హుజూరాబాద్‌ ప్రజలు ఇచ్చారు. మీ ఆదరాభిమానాలతో, ఆశీర్వాదాలతోనే నేను మంత్రినయ్యాను. ఈ పదవి మీరు పెట్టిన భిక్షే. కనుక మీరే హక్కుదారులు. నా కారుకు మీరు పెట్రోల్ పోయిస్తే తిరుగుతున్నాను. కనుక మీ రుణం తీర్చుకోవలసిన బాధ్యత నాకుంది. అందుకే నియోజకవర్గం అభివృద్ధికి, నియోజకవర్గంలో ప్రజాసమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో పనిచేస్తున్నాను. నేను ఆర్ధికమంత్రిగా ఉన్నప్పుడు జమ్మికుంట ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ.40 కోట్లు కేటాయించాను. నన్ను మంత్రిని చేసిన హుజూరాబాద్‌ కోసం రూ.50 కోట్లు మంజూరు చేశాను. హుజూరాబాద్‌ ప్రజల కోసం ఏమి చేయడానికైనా నేను ఎప్పుడూ సిద్దంగా ఉంటాను,” అని అన్నారు.

ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేయాలన్నా కూడా ముఖ్యమంత్రి లేదా పార్టీ అధినేత మాత్రమే టికెట్లు ఇవ్వగలరు తప్ప ప్రజలుకాదని అందరికీ తెలుసు. ఒకవేళ టికెట్ పొందిన నేతలకు ప్రజాధారణ ఉంటే ఎన్నికలలో గెలిచి ఎమ్మెల్యేలు, ఎంపీలు కాగలరేమో కానీ మంత్రులు కాలేరు. అప్పుడు కూడా ముఖ్యమంత్రి లేదా పార్టీ అధినేత మాత్రమే మంత్రి పదవులు ఇవ్వగలరు తప్ప ప్రజలు కారు. అందుకే పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముఖ్యమంత్రి, పార్టీ అధినేత పట్ల విధేయంగా మెలుగుతుంటారు. 

కానీ ఈటల రాజేందర్‌ తనకు ప్రజలే మంత్రి పదవి ఇచ్చారని, వారు పోసే పెట్రోల్‌తోనే తన ‘కారు’ నడుస్తోందని, కనుక ఆ కారుకు ‘హక్కుదారులు’ మీరేనని చెప్పడం ఆయన మనసులో వేరేదో ఉందని అర్ధమవుతోంది. అదేమిటో కాలమే చెప్పాలి.


Related Post