భారత్‌-పాక్‌ సమస్యకు ట్రంప్ చెప్పిన చిట్కా

February 22, 2020


img

త్వరలో భారత్‌లో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వాషింగ్టన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “భారత్‌, పాకిస్థాన్‌ల మద్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గి, రెండు దేశాల మద్య మళ్ళీ శాంతి చర్చలు జరగాలంటే దానికి ఒకటే ఒక పరిష్కారం ఉంది. పాకిస్థాన్‌ ప్రభుత్వం ఉగ్రవాదులపై చర్యల తీసుకొంటే ఇరుదేశాల మద్య శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది. మళ్ళీ చర్చలు మొదలవుతాయి,” అని అన్నారు.

ముంబై ప్రేలుళ్ల సూత్రధారి, జమ్మత్ ఉద్-దవా ఉగ్రవాద సంస్థ అధినేత హఫీజ్ సయీద్‌కు పాక్‌ యాంటీ టెర్రరిస్ట్ కోర్టు ఇటీవల 11 జైలు శిక్ష విధించింది. కానీ అంతమాత్రన్న ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ ప్రభుత్వం బుద్ది మారిందనుకోలేము. భారత్‌ను రాజకీయంగా, ఆర్దికంగా, దౌత్యపరంగా దెబ్బతీయాలని పాక్‌ పాలకులు చేస్తున్న కుట్రల గురించి డోనాల్డ్ ట్రంప్‌కు కూడా తెలుసు. కానీ త్వరలో ఆయన భారత్‌లో పర్యటించనున్నందున, భారత్‌కు అనుకూలంగా ఇటువంటి చిలకపలుకులు పలుకుతున్నారని భావించవచ్చు. భారత్‌ వస్తున్నప్పుడు భారత్‌కు అనుకూలంగా మాట్లాడే ట్రంప్, పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కలిసినప్పుడు, “ఖాన్ నాకు గొప్ప మిత్రుడు. పాకిస్థాన్‌ ఓ అద్భుతమైన దేశం. కశ్మీర్ సమస్యపై మద్యవర్తిత్వం వహించేందుకు సిద్దంగా ఉన్నాను,” అంటూ పాక్‌ ప్రజలను మెప్పించేవిధంగా మాట్లాడటం అందరూ విన్నారు. అంటే డొనాల్డ్ ట్రంప్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టేరకమని అర్ధమవుతోంది. నిజానికి ఆయనకు భారత్‌, పాక్‌ రెండు దేశాలపై సదాభిప్రాయం లేదని పలు సందర్భాలలో ఆయన మాట్లాడిన మాటలు వింటే అర్ధమవుతుంది. అటువంటి వ్యక్తిని ప్రసన్నం చేసుకొనేందుకు భారత ప్రభుత్వం ఎందుకు అంత ఆరాటపడిపోతోందో? అంత ఆరాటపడినా ట్రంప్ ప్రసన్నం అవుతారా? అంటే అనుమానమే. 


Related Post