వామపక్షాలను ప్రజలు ఎందుకు ఆదరించడం లేదు?

February 22, 2020


img

ప్రజాసమస్యలపై పోరాడటంలో దేశంలో వామపక్షాలే ఎప్పుడూ ముందుంటాయనే సంగతి ప్రజలందరికీ తెలుసు. అవి ప్రజల తరపున కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలతో ఎంతగా పోరాడుతున్నప్పటికీ ఎన్నికలలో ప్రజలు వాటిని పట్టించుకోకుండా కులమతాలు, డబ్బు, ఒత్తిడి, పరపతిలతో రాజకీయాలు చేసే పార్టీలనే ఎన్నుకొంటుంటారు. ఈవిధంగా ఎందుకు జరుగుతోందని వామపక్షాలు ఏనాడూ ఆలోచించాయో లేదో తెలియదు. ఒకవేళ ఆలోచించి ఉండి ఉంటే అవి కూడా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తమ వ్యూహాలను మార్చుకొని అధికారం పొందగలిగి ఉండేవి. 

సిపిఐ, సిపిఎం రెండూ కూడా ఎన్నికల సమయంలో ఏదో ఓ జాతీయ పార్టీతోనో లేదా ప్రాంతీయపార్టీతోనో పొత్తులు పెట్టుకొని కొన్ని సీట్లు సంపాదించుకుంటే అదే గొప్ప అన్నట్లు వ్యవహరిస్తుంటాయి. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సిపిఐ పార్టీ కాంగ్రెస్ కూటమితో చేతులు కలిపినప్పుడు చివరి నిమిషం వరకు సీట్ల సర్దుబాట్లపై వాటి మద్య ఎంత రగడ జరిగిందో అందరికీ తెలుసు. కానీ లభించిన సీట్లలో కూడా సిపిఐ గెలవలేకపోయింది. 

అయితే సిపిఎం మాత్రం రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ కూడగట్టి పోటీ చేసింది కానీ టిఆర్ఎస్‌ ప్రభంజనంలో అవన్నీ కూడా కొట్టుకుపోయాయి. అంటే వాస్తవ రాజకీయ, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఆ పార్టీల ఆలోచనా విధానంలోనే మార్పు అవసరమని అర్ధమవుతోంది. నేటి నుంచి మూడు రోజులపాటు మంచిర్యాలలో జరుగనున్న సిపిఐ మహాసభలలో ఆ పార్టీ నేతలు కొత్త ఆలోచనలు ఏమైనా చేస్తారా లేక ఊక దంపుడు ప్రసంగాలతో కాలక్షేపం చేసి ముగిస్తారో?


Related Post