కాంగ్రెస్‌లో విచిత్రం!

February 21, 2020


img

కాంగ్రెస్ పార్టీలో చాలా విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జాతీయ అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఆ పార్టీలో ఎవరూ ముందుకు రావడం లేదు. కానీ తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి కనీసం అరడజను మంది పోటీ పడుతున్నారు. రాహుల్‌ గాంధీ అస్త్రసన్యాసం చేసిన తరువాత నెహ్రూ కుటుంబానికి చెందని బయటివ్యక్తులు పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం వచ్చింది కానీ ఎవరూ సాహసించలేకపోవడంతో ఓపిక లేకపోయినా మళ్ళీ సోనియా గాంధీయే తాత్కాలికంగా ఆ పదవి చేపట్టవలసి వచ్చింది. నేటికీ ఆమె తరువాత ఎవరు పార్టీ పగ్గాలు చేపడతారో తెలియని పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నాయి. 

ఇక తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌ రెడ్డి, జగ్గారెడ్డి, వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ, శ్రీధర్ బాబు, పొన్నాల తదితరులు పోటీ పడుతున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మళ్ళీ మరోసారి ‘నేను కూడా అధ్యక్ష పదవి రేసులో ఉన్నాను,’ అని ఇవాళ్ళ ప్రకటించారు.

మరో విశేషమేమిటంటే, అటు కేంద్రం(జాతీయస్థాయి)లో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది. అక్కడ ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని, ఇక్కడ సిఎం కేసీఆర్‌ నేతృత్వంలో టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొలేకపోతోంది. 

కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్యతో బాధపడుతున్నా పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా..భవిష్యత్‌ అగమ్యగోచరంగా కనిపిస్తున్నప్పటికీ అరడజను మంది పిసిసి అధ్యక్ష పదవికి పోటీ పడుతుండటం విశేషం.


Related Post