అధ్యక్షుడుని ఎన్నుకొనే ధైర్యం కాంగ్రెస్‌కు లేదా?

February 21, 2020


img

గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని అందరికీ ముందు నుంచే తెలుసు. చివరికి అదే జరిగింది. పార్టీ ఓటమికి తనదే బాధ్యత అంటూ అధ్యక్షపదవికి రాజీనామా చేసిన రాహుల్‌ గాంధీ, పార్టీలో సీనియర్లు అలసత్వంగా వ్యవహరించడం వలననే పార్టీ ఓడిపోయిందని ఆరోపించడం విశేషం. పదవికి రాజీనామా చేసిన తరువాత తాను కూడా ఓ సాధారణ కార్యకర్తనని చెప్పుకొన్న రాహుల్‌ గాంధీ, అధ్యక్షపదవి చేపట్టడంపై ఆంక్షలు విధించడం మరో విశేషం. తన కుటుంబంలో ఎవరూ ఆ పదవి చేపట్టకూడదని, అధ్యక్ష ఎంపిక ప్రక్రియలో ఎవరూ జోక్యం చేసుకోరాదని ఆంక్షలు విధించారు. 

ఎన్నికలలో పార్టీలకు గెలుపోటములు సహజం. కానీ ఓడిపోయినప్పుడు కాడి పడేసి చేతులు దులుపుకోవడం, గెలిచినప్పుడు నేనే చక్రం తిప్పాలనుకోవడం రెండూ సరికాదు. లోక్‌సభ ఎన్నికలలో ఓటమితో డీలాపడిన పార్టీ శ్రేణులలో మళ్ళీ నూతనోత్సాహం నింపవలసిన రాహుల్‌ గాంధీ కాడి కిందపడేయడమే కాక, ఓటమితో బలహీనపడిన కాంగ్రెస్ పార్టీని తన నిర్ణయం, ఆంక్షలతో మరింత బలహీనపరిచినట్లయింది. ఈ పరిస్థితులలో పార్టీ ఓటమికి కారకులని రాహుల్‌ గాంధీ చేత ఆరోపించబడిన సీనియర్ నేతలే తమలో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకోవలసి రావడం ఇంకా విచిత్రం. 

కానీ వారు ఆ సాహసం కూడా చేయలేకపోయారు. అధ్యక్ష పదవిని ఆశించడమంటే సోనియా, రాహుల్‌ గాంధీల పట్ల అవిధేయత ప్రదర్శించినట్లు భావించి వెనకడుగువేసి ఉండవచ్చు లేదా కప్పల తక్కెడ వంటి కాంగ్రెస్ పార్టీలోని నేతలందరినీ కట్టడి చేసి పార్టీని ముందుకు నడిపించడం కష్టమని భయపడి ఉండవచ్చు. కారణాలు ఏవైనప్పటికీ అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ ఎవరూ సాహసం చేయలేకపోయారు. దాంతో మళ్ళీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీకే బాధ్యతలు అప్పగించారు. 

అందుకే కొత్త అధ్యక్షుడుని ఎన్నుకోవడంలో సీనియర్లు విఫలమయ్యారని సీనియర్ నేత సందీప్ దీక్షిత్ విమర్శించారు. దానిని మరో సీనియర్ నేత శశీ ధరూర్ సమర్ధిస్తూ మాట్లాడటమే కాకుండా వీలైనంత త్వరగా పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడుని ఎన్నుకోవాలని ఏఐసీసీకి విజ్ఞప్తి చేశారు. 

కాంగ్రెస్ పార్టీపై సర్వహక్కులు తమకే ఉన్నాయని భావించే సోనియా, రాహుల్‌, ప్రియాంకా గాంధీలే నానాటికీ బలహీనపడుతున్న కాంగ్రెస్ పార్టీని కాపాడుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేయనప్పుడు, ఇక పార్టీలో మిగిలినవారు మాత్రం ఏలా చేస్తారు? 

పార్టీని నడిపించాలంటే నాయకత్వ లక్షణాలు, శక్తియుక్తులు, ప్రజాధారణ కలిగి ఉండాలి. డిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, తెలంగాణలో టిఆర్ఎస్‌, ఏపీలో వైసీపీ, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీల అధినేతలు ఆ లక్షణాలు పుష్కలంగా కలిగి ఉన్నారు. మరి 130 సం.ల చరిత్ర కలిగి, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న కాంగ్రెస్ పార్టీలో అటువంటి నాయకత్వ లక్షణాలు కలిగిన నేత ఒక్కరూ లేరనుకోలేము. 

వంశం, విధేయత గురించి ఆలోచిస్తూ కూర్చోంటే ఏదో ఒకరోజు కాంగ్రెస్ పార్టీ కనబడకుండా పోవచ్చు. పార్టీ లేకపోతే దానినే నమ్ముకొన్న నేతలకు అడ్రస్ ఉండదు. కనుక పార్టీ శ్రేయస్సు కోసం కాకపోయినా... తమ రాజకీయ భవిష్యత్‌ కోసమైనా పార్టీలో ఎవరో ఒకరు పిల్లి మెడలో గంటకట్టక తప్పదు.


Related Post