రాజ్యసభకు కవిత?

February 21, 2020


img

గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలలో టిఆర్ఎస్‌ సిట్టింగ్ ఎంపీ కవిత మళ్ళీ నిజామాబాద్‌ నుంచి పోటీ చేసి బిజెపి అభ్యర్ధి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోవడంతో ఆమె రాజకీయనిరుద్యోగిగా మారారు. అంత ప్రతిభాశాలి అయిన ఆమె సేవలు పార్టీకి, ప్రభుత్వానికి, రాష్ట్రానికి చాలా అవసరం కనుక సిఎం కేసీఆర్‌ ఆమెను రాజ్యసభకు పంపించే యోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్ళిన కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్‌), గరికపాటి మోహన్ రావు (బిజెపి)ల పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగుస్తుంది. అలాగే ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్ళిన కె కేశవరావు కూడా ఆదేరోజున పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఆయన ఏపీ కోటాలో రాజ్యసభకు వెళ్లినందున ఆ సీటు ఈసారి ఏపీలో వైసీపీకి దక్కనుంది. 

రాజ్యసభ సభ్యులను శాసనసభ్యులు ఎన్నుకొంటారు. అయితే తెలంగాణ కాంగ్రెస్‌, బిజెపిలకు తగినంతమంది ఎమ్మెల్యేలు లేనందున వాటి రెండు సీట్లు ఈసారి టిఆర్ఎస్‌కు దక్కనున్నాయి. వాటిలో ఒక సీటును కవితకు కేటాయించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక రెండో సీటుకు టిఆర్ఎస్‌లో కె కేశవరావుతో సహా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రొఫెసర్‌ సీతారాంనాయక్‌, మందా జగన్నాథం తదితరులు పోటీపడుతున్నారు. వారిలో ఎవరికి సీటు దక్కుతుందో తెలియాలంటే ఏప్రిల్ వరకు వేచిచూడాల్సిందే. రాజ్యసభలో ఖాళీ అవుతున్న స్థానాలను భర్తీ చేయడానికి 50 రోజులు ముందుగా ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టాలనే నిబందన ఉన్నందున త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. 


Related Post