అసదుద్దీన్ సభలో పాకిస్థాన్‌ జిందాబాద్!

February 21, 2020


img

సీఏఏకు వ్యతిరేకిస్తూ ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్‌’ పేరుతో గురువారం బెంగళూరులో ఓ సభ జరిగింది. దానిలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన సమక్షంలోనే వేదికపై ఓ మహిళ ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసి అందరినీ తనతో గొంతు కలపమని ప్రోత్సహించింది. అది చూసి కంగారుపడిన అసదుద్దీన్ ఓవైసీ ఆమెను వారించారు. కానీ ఆమె పట్టించుకోకుండా ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తుండటంతో అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం పట్టలేక ఆమె వద్దకు వెళ్ళి చేతిలో నుంచి మైక్ లాక్కొనే ప్రయత్నం చేశారు. అయినా ఆమె ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తుండటంతో సభ నిర్వాహకులు ఆమెను బలవంతంగా వేదిక మీద నుంచి కిందకు దించి ఆమె చేతిలో మైక్ లాక్కొన్నారు. అక్కడే ఉన్న పోలీసులు ఆమెను అదుపులో తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

ఈ షాక్ నుంచి తేరుకొన్న అసదుద్దీన్ ఓవైసీ ప్రజలనుద్దేశ్యించి మాట్లాడుతూ, “ఆ మహిళతో...ఆమె అభిప్రాయాలతో మజ్లీస్ పార్టీకి ఎటువంటి సబందమూ లేదు. నిర్వాహకులు అటువంటి వ్యక్తిని సభకు ఆహ్వానించకుండా ఉంటే బాగుండేది. ఈవిధంగా జరుగుతుందని తెలిస్తే నేను ఈ సభకు వచ్చేవాడినే కాను. మనమంతా భారతీయులం. ప్రజల మద్య చిచ్చుపెడుతున్న సీఏఏను అడ్డుకొని మన దేశాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ సభ నిర్వహించుకొంటున్నాము తప్ప శతృదేశమైన పాకిస్థాన్‌కు మద్దతు పలకడానికి కాదని అందరూ గుర్తుపెట్టుకోవాలి,” అని అన్నారు. 

దేశంలో కాంగ్రెస్, ప్రతిపక్షపార్టీలు చేస్తున్న సీఏఏ వ్యతిరేక ఆందోళనలు భారత్ ప్రతిష్టకు భంగం కలిగించేలా, పాకిస్థాన్‌కు మన దేశ వ్యవహారాలలో వేలుపెట్టే అవకాశం కల్పించేలా ఉన్నాయని బిజెపి ఆరోపిస్తోంది. సీఏఏ ద్వారా దేశప్రజల మద్య చిచ్చు పెట్టేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందని మజ్లీస్ ఆరోపిస్తుంటే, ప్రతిపక్షాలు తమ రాజకీయ అవసరాలు, మనుగడ కోసం చేస్తున్న ఈ సీఏఏ ఆందోళనలతోనే ప్రజల మద్య దూరం పెంచుతున్నాయని బిజెపి ఆరోపిస్తోంది. సీఏఏ ఆందోళనలతో దేశంలో ముస్లింప్రజలను ఆకట్టుకొని బలమైన శక్తిగా ఎదగాలని మజ్లీస్ పార్టీ ప్రయత్నిస్తోందని బిజెపి ఆరోపిస్తోంది. కనుక సీఏఏ వలన లాభనష్టాల కంటే దానిపై జరుగుతున్న ఈ రాజకీయాలే దేశానికి ఎక్కువ నష్టం కలిగిస్తున్నాయని చెప్పక తప్పదు. బెంగళూరులో నిన్న జరిగిన ఈ ఘటన అందుకు ఒక తాజా ఉదాహరణ.


Related Post