తూచ్..70 లక్షలు కాదు ఒక లక్షే!

February 20, 2020


img

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల క్రితం వాషింగ్టన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఈనెల 24న నేను, నా భార్య అహ్మదాబాద్‌ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ మాకు సుమారు 70 లక్షల మంది భారతీయులు స్వాగతం పలుకబోతున్నారని విన్నాను. అలాగే అక్కడ కొత్తగా నిర్మించిన ప్రపంచంలోకెల్లా అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో లక్షమంది మాకు స్వాగతం పలుకబోతున్నారని విన్నాను. కనుక భారత్‌ పర్యటనకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను,” అని అన్నారు.

అహ్మదాబాద్‌లో ట్రంప్ దంపతులకు 70 లక్షలమంది స్వాగతం పలుకబోతున్నారని మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. వాణిజ్య వ్యవహారాలలో అమెరికా పట్ల భారత్‌ చాలా అనుచితంగా వ్యవహరిస్తోందని కనుక ఈపర్యటనలో భారత్‌తో ఎటువంటి వాణిజ్య ఒప్పందాలు ఉండకపోవచ్చని డోనాల్డ్ ట్రంప్‌ నిష్కర్షగా ముందే చెపుతుంటే ఆయన మెప్పు కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి విపరీత ఆలోచనలు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

అసలు అహ్మదాబాద్‌లో అంత మంది జనాభాయే లేనప్పుడు 70 లక్షల మందిని పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చి నిలబెడతారా? అయినా ఆ అవసరం ఏమిటి? అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో గుజరాత్ ప్రభుత్వం దిగివచ్చింది. 

అహ్మదాబాద్‌ మున్సిపల్ కమీషనర్ విజయ్ నెహ్రా బుదవారం మీడియాతో మాట్లాడుతూ, “ట్రంప్ పర్యటన సందర్భంగా 70 లక్షలమందితో ఆయనకు స్వాగతం పలుకుతామని మీడియాలో వచ్చిన వార్తలు కేవలం ఊహాగానాలే.  ఆరోజున సుమారు లక్షమంది వస్తారని అంచనా వేస్తున్నాము,” అని సవరణ ప్రకటన చేశారు. 

ఒకప్పుడు తాను బస్టాండ్‌లో ఛాయ్ అమ్ముకొని జీవించేవాడినని, ఆ స్థాయి నుంచి కష్టపడి ఈ స్థాయికి ఎదిగానని  పదేపదే గర్వంగా చెప్పుకొనే ప్రధాని నరేంద్రమోడీ, ఇప్పుడు అహ్మదాబాద్‌లో రోడ్డుపక్కన ఉన్న మురికివాడలలో పేదప్రజలు ట్రంప్ కళ్ళలో పడితే అవమానంగా భావించడం, వారు...వారి రేకుల షెడ్ల ఇళ్ళు కనబడకుండా ఏకంగా గోడ కట్టిస్తుండటం, కొందరిని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించడం చాలా శోచనీయం. 

మన దేశాధినేతలు ఎప్పుడైనా అమెరికా వెళితే అక్కడ అధికారులు ప్రోటోకాల్ ప్రకారం వ్యవహరిస్తారు తప్ప ఈవిధంగా అనవసరమైన హడావుడి, ఆర్భాటాలు చేయరు. తమ దేశప్రజలను కనబడకుండా ఇలా దాచేయరు. కానీ విదేశీయులు ఎవరైనా భారత్‌ వస్తే మన ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు వాళ్ళను ప్రసన్నం చేసుకోవడానికి ప్రతీసారి ఈవిధంగా నానా హైరానా పడి నవ్వులపాలవుతుంటారు.


Related Post