ఆధార్ విచారణ వాయిదా...ఒత్తిడే కారణమా?

February 20, 2020


img

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఆధార్) హైదరాబాద్‌ పాతబస్తీలో రోహింగ్యాలకు అనుమానించబడుతున్న 127 మందిని ఈరోజు విచారణకు హాజరుకావాలని ఆదేశించడంపై తీవ్ర కలకలం మొదలైంది. మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దానిని తప్పు పట్టారు. దీనిపై డిజిపి మహేందర్ రెడ్డి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నోటీసులపై వివాదం చెలరేగడంతో ఆధార్ సంస్థ చివరి నిమిషంలో వెనక్కు తగ్గిన్నట్లుంది. ఈరోజు హైదరాబాద్‌, బాలాపూర్ మెగా గార్డెన్స్‌లో జరుగవలసిన విచారణను వాయిదా వేస్తున్నట్లు నిన్న రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో నోటీసులు అందుకొన్న 127 మందికి మళ్ళీ ఎప్పుడు విచారణకు హాజరుకావాలో తెలియజేస్తూ స్పీడ్ పోస్ట్ ద్వారా నోటీసులు పంపిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. 

హైదరాబాద్‌, భవానీనగర్‌ తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన సత్తార్‌ఖాన్‌ తప్పుడు దృవపత్రాలతో ఆధార్ కార్డు పొందడమే కాకుండా బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చి హైదరాబాద్‌లో అక్రమంగా నివశిస్తున్న మరో 127 మందికి తప్పుడు దృవపత్రాలతో ఆధార్ కార్డులు ఇప్పించారని తెలంగాణ పోలీస్ శాఖ విచారణలో తేలింది. అదే విషయం ఆధార్ సంస్థకు తెలియజేయడంతో ఆ 127 మందికి విచారణకు హాజరుకావాలని కోరుతూ నోటీసులు పంపించింది. కానీ రాజకీయ ఒత్తిళ్ళ కారణంగా విచారణను వాయిదా వేసినట్లు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే నిజమైతే.. మరి పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అక్రమంగా స్థిరపడిన లక్షలాదిమంది విదేశీయులను ఏవిధంగా గుర్తించగలరు? ఎప్పటికి గుర్తించగలరు? ఏవిధంగా వారిని స్వదేశాలకు తిప్పి పంపగలరు? 


Related Post