హైదరాబాద్‌ నుంచే సీఏఏ అమలు ప్రారంభం?

February 19, 2020


img

రాష్ట్రంలో టిఆర్ఎస్‌, మజ్లీస్ రెండూ పార్టీలు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. సీఏఏకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని, అప్పటికీ కేంద్రం తీరుమారకపోతే హైదరాబాద్‌లో 10 లక్షల మందితో బహిరంగసభ ఏర్పాటు చేసి ఉద్యమిస్తామని సిఎం కేసీఆర్‌ స్వయంగా చెప్పారు. కానీ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనే సీఏఏ అమలుకు రంగం సిద్దం అవడం విశేషం. 

హైదరాబాద్‌ భవానీనగర్‌ తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన సత్తార్‌ఖాన్‌తో సహా పాతబస్తీలో 127 మందికి నోటీసులు అందాయి. రేపు అంటే గురువారం ఉదయం 11 గంటలకు వారందరూ తమతమ ఒరిజినల్ ఆధార్ కార్డులు, ఇతర దృవపత్రాలతో బాలాపూర్‌ రాయల్‌ కాలనీలోని మెఘా గార్డెన్‌ ఫంక్షన్‌హల్లో విచారణాధికారి అమితా బిందూ ఎదుట హాజరుకావలని నోటీసులలో పేర్కొంది. వారందరూ తప్పుడు పత్రాలతో ఆధార్ కార్డులు పొందారని తమకు పిర్యాదులు అందాయని, కనుక వారు తమ భారతీయ పౌరసత్వం నిరూపించే ఆధారాలతో అందరూ తప్పనిసరిగా విచారణకు హాజరుకావలని నోటీసులలో పేర్కొన్నారు. ఒకవేళ ఒరిజినల్ ఆధార్ కార్డులు చూపలేకపోయినా, విచారణకు హాజరుకాకపోయినా చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని నోటీసులలో హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో నోటీసులు అందుకొన్నవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అప్పుడే కొందరు న్యాయవాదులను కలుస్తున్నారు. 

ఆటో డ్రైవరుగా పనిచేసుకు బతుకుతున్న సత్తార్‌ఖాన్‌ తన న్యాయవాది ముజఫరుల్లా ఖాన్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ, “నేను ఇక్కడే హైదరాబాద్‌లో పుట్టాను. పుట్టినప్పటి నుంచి ఏనాడూ విదేశాలకు వెళ్లలేదు. నా తండ్రి ఆల్విన్ కంపెనీలో పనిచేసేవారు. ఆయన మరణించిన తరువాత ఆ పెన్షన్ నా తల్లి అందుకుంటోంది. మా కుటుంబంలో ఉన్న 10 మందికీ ఆధార్ కార్డుతో సహా అన్ని దృవపత్రాలు ఉన్నాయి. కనుక మేము భయపడటం లేదు. కానీ మాకు ఎందుకు ఇటువంటి నోటీసులు పంపించారో అర్ధం కావడం లేదు,” అని ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.  

సుమారు రెండేళ్ళ కిందట హైదరాబాద్‌ పోలీసులు నగరంలో సంతోష్ నగర్‌లోని ఓ మీసేవా కేంద్రంలో నకిలీ ఆధార్ కార్డులు తయారుచేస్తున్నట్లు గుర్తించారు. దానిలో నకిలీ ఆధార్ కార్డులు తయారుచేస్తున్న బర్మా దేశానికి చెందిన కొందరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.వారిని ప్రశ్నించగా నగరంలో సుమారు 100 మందికి నకిలీ ఆధార్ కార్డులు తయారుచేసి ఇచ్చినట్లు కనుగొన్నారు. ఆ సమాచారం ఆధారంగా ఇప్పుడు పాతబస్తీలో 127 మందికి ఆధార్ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే పాతబస్తీలో దీనిపై కలకలం మొదలవడంతో మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ, “నోటీసులు ఇచ్చిన వారిలో ముస్లింలు, దళితులు ఎంతమందున్నారో  డిజిపి వివరణ ఇవ్వాలి. అసలు పోలీసులు కార్బన్ సర్చ్ లో ప్రజలను ఆధార్ కార్డు చూపాలని ఏ అధికారంతో అడుగుతున్నారో చెప్పాలి," అని ట్వీట్ చేశారు.


Related Post