టిఆర్ఎస్‌- కేంద్రం మద్య యుద్ధం ఎందుకు?

February 19, 2020


img

రైల్వేమంత్రి పీయూష్ గోయల్ సికింద్రాబాద్‌ పర్యటన సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేంద్రప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందని విమర్శించడం, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని పీయూష్ గోయల్ ఘాటుగా బదులివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచినా ఇది రానున్న రోజులలో టిఆర్ఎస్‌-కేంద్రం మద్య యుద్ధానికి ప్రారంభం అని చెప్పవచ్చు. కానీ అసలు టిఆర్ఎస్‌- కేంద్రం మద్య యుద్ధం ఎందుకు? అనే సందేహం కలగడం సహజం. దానికి చాలా బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. 

1. సిఎం కేసీఆర్‌ డిల్లీలో పాగా వేయాలని ఆశపడుతుంటే, బిజెపి తెలంగాణలో పాగా వేయాలని ఆశపడుతుండటం.  

2. తెలంగాణ  సొంత సామ్రాజ్యమని భావిస్తున్న టిఆర్ఎస్‌ రాష్ట్రంలో ఎప్పటికీ తామే అధికారంలో ఉండాలనుకోవడం. 

3. కేటీఆర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి చేయాలంటే కేసీఆర్‌ సిఎం పదవిలో నుంచి హుందాగా తప్పుకోవలసి ఉంటుంది. కనుక సిఎం కేసీఆర్‌ ఫెడరల్ ఫ్రంట్‌తో జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించడం అనివార్యంగా మారింది.   

4. కారణాలు ఏవైనప్పటికీ సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలని నిశ్చయించుకొన్నారు కనుక కాంగ్రెస్‌, బిజెపిలు రెండూ దేశానికి పనికిరావని, వాటికి ఫెడరల్ ఫ్రంట్‌ సరైన ప్రత్యామ్నాయమని వాదిస్తున్నారు. అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో సిఎం కేసీఆర్‌ ఫెడరల్ ఫ్రంట్‌ను సిద్దం చేసుకొని బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేను డ్డీ కొని ఓడించి, ప్రధాని నరేంద్రమోడీ గద్దె దించాలనుకొంటున్నారని బిజెపి భావించడం సహజమే. 

5. సిఎం కేసీఆర్‌ కేంద్రంలో తమ ప్రభుత్వాన్ని గద్దె దించాలనుకొంటున్నారు కనుక ఆయనను, టిఆర్ఎస్‌ను  రాజకీయశత్రువుగా భావించి బిజెపి యుద్దానికి సిద్దపడుతోంది. 

6. ఉత్తరాది రాష్ట్రాలలో క్రమంగా విస్తరించిన బిజెపి దక్షిణాది రాష్ట్రాలలో కేవలం కర్ణాటకలో మాత్రమే మళ్ళీ అధికారంలోకి రాగలిగింది. తెలంగాణలో బిజెపి బలంగా ఉన్నప్పటికీ సిఎం కేసీఆర్‌, టిఆర్ఎస్‌ ధాటికి తట్టుకోలేక చతికిలపడుతోంది. కానీ లోక్‌సభ ఎన్నికలలో బిజెపి అనూహ్యంగా 4 ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో గట్టిగా ప్రయత్నిస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాగలమనే నమ్మకం ఏర్పడింది. కనుక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకొని టిఆర్ఎస్‌ను గద్దె దించి అధికారం చేజిక్కించుకోవాలని బిజెపి ఆశ పడుతోంది.  

తన సామ్రాజ్యంలోకి వేరెవరూ ప్రవేశించకూడదనుకొంటున్న సిఎం కేసీఆర్‌, డిల్లీపై జైత్రయాత్రకు సిద్దం అవుతున్నారు. అలాగే కేంద్రంలో ఎప్పటికే తామే అధికారంలో ఉండాలని కోరుకొంటున్న బిజెపి కూడా తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా తెలంగాణపై దృష్టి పెట్టింది. కనుక టిఆర్ఎస్‌-బిజెపిల మద్య యుద్ధం అనివార్యమైంది. 

రాజులు...రాజ్యాలు పోయాయి. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. కానీ నేటికీ మన పాలకులలో రాచరిక లక్షణాలు, రాజ్యవిస్తరణ కోరికలు మాత్రం అలాగే ఉన్నాయి. డిల్లీ స్థాయి నుంచి గల్లీ స్థాయి నేతవరకు ఎవరూ ఇందుకు మినహాయింపు కాదు. ఎవరి సామ్రాజ్యం వారిదే..దానిలోకి ఇతరులకు ప్రవేశం నిషేదం.

అందుకే ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలోకి మరో నియోజకవర్గం ఎమ్మెల్యే లేదా ఒక వార్డులోకి మరో వార్డు మెంబరు రావడానికి వీలులేదు. ఒకప్పుడు రాజులు శిలాశాసనాలు... స్థూపాల ద్వారా తమ అధికారాన్ని చాటి చెప్పుకొనేవారు. ఇప్పుడు వాటి స్థానంలో  ఫ్లెక్సీ బ్యానర్లు వచ్చాయి. ప్రతీ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే లేదా సదరు మంత్రి ఫోటోలతో కూడిన బ్యానర్లు విరివిగా కనిపిస్తుంటాయి. ‘ఇది మా సామ్రాజ్యం... దీనిలోకి ఇతరులు ప్రవేశించడానికి వీలులేదు...’ అని చెప్పడం కోసమే వాటిని ఏర్పాటు చేసుకొంటున్నట్లు భావించవచ్చు.   

ఒకప్పుడు బంగారు కిరీటాలు ధరించిన రాజులు రధాలపై ఠీవిగా తిరిగేవారు. ఇప్పుడు వారి స్థానంలో బ్లాక్ క్యాట్ కమాండోల పహారాలో డజన్ల కొద్దీ కార్ల కాన్వా య్‌లో ఎమ్మెల్యేలు, మంత్రులు తిరుగుతున్నారు. వేషబాషలు, వాహనాలు మారాయి తప్ప రాచరిక పోకడలు, ఆలోచనలు ఏమీ మారలేదు. దేశంలో ప్రజాస్వామ్యం ముసుగులో రాచరికం కొనసాగుతోంది కనుక వారి మద్య యుద్ధాలు కూడా అనివార్యమేనని చెప్పక తప్పదు. ఇవన్నీ వినడానికి విడ్డూరంగా ఉన్నా నిశితంగా గమనిస్తే ప్రస్తుతం మనమందరం ప్రజాస్వామ్య మేలి ముసుగులో రాచరిక వ్యవస్థలోనే ఉన్నామని అర్ధం అవుతుంది.


Related Post