నిర్భయ దోషులకు ఉరిశిక్ష కొత్త ముహూర్తం

February 17, 2020


img

నిర్భయకేసులో నలుగురు దోషులు వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్ సింగ్, అక్షయ్ సింగ్‌ల ఉరిశిక్షకు డిల్లీ పటియాలా హౌస్ కోర్టు నేడు మళ్ళీ డెత్ వారెంట్స్ జారీ చేసింది. మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురినీ ఒకేసారి ఉరి తీయాలని తిహార్ జైల్ అధికారులను ఆదేశిస్తూ నలుగురు దోషుల పేరిట డెత్ వారెంట్స్ జారీ చేసింది. 

వారు నలుగురు ఒకరి తరువాత మరొకరు సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేస్తూ, రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకుంటూ వీలైనంత కాలం ఉరిశిక్షను వాయిదా వేయించుకొంటున్నారు. నలుగురినీ ఒకేసారి ఉరి తీయాలనే నిబందన, రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరించిన తరువాత 14 రోజులు వేచి చూడాలనే నిబందనలను వారి న్యాయవాదులు చాలా తెలివిగా ఉపయోగించుకొంటూ ఉరిశిక్షను రెండుసార్లు వాయిదా వేయించగలిగారు. మొదట జనవరి 22న తప్పించుకున్నారు. మళ్ళీ ఫిబ్రవరి 1న కూడా అదేవిధంగా తప్పించుకున్నారు. 

ఇప్పటివరకు వారి న్యాయవాదులు అనుసరిస్తున్న విధానాన్ని చూసినవారికి తరువాత ఏమి జరుగుతుందో తేలికగానే ఊహించుకోవచ్చు. వారిలో పవన్ గుప్తా అనే దోషి ఇంతవరకు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకోలేదు. ఉరిశిక్ష తేదీ దగ్గర పడిన తరువాత పిటిషన్‌ పెట్టుకొని, అది తిరస్కరణకు గురయ్యాక తాపీగా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్‌ వేయవచ్చు. తద్వారా మరో నెలరోజులు ఉరిశిక్షను వాయిదా వేయించుకునే అవకాశం ఉంది.

అత్యంత హేయమైన నేరానికి పాల్పడి ఉరిశిక్ష విధించబడిన నలుగురు దోషులు ఈవిధంగా చట్టంతో...సుప్రీంకోర్టు, రాష్ట్రపతివంటి అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలాడుతూ సవాలు విసురుతుంటే, ఎవరూ ఏమీ చేయలేకపోవడం…వారి ఆటలను ఓపికగా భరించవలసిరావడం చాలా బాధకరమే. వారికి ఉరిశిక్ష అమలుచేయలేక సుప్రీంకోర్టే నిసహాయత వ్యక్తం చేస్తుంటే దేశంలో ఇటువంటి నేరాలు జరుగకుండా ఉంటాయా?


Related Post