కేసీఆర్‌ ప్రధాని కావాలి...మరి మోడీ?

February 17, 2020


img

లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌, బిజెపిలు రెంటికీ ప్రభుత్వ ఏర్పాటుకు తగినన్ని ఎంపీ సీట్లు రావని, కనుక ప్రాంతీయపార్టీలను ఫెడరల్ ఫ్రంట్‌ పేరుతో ఏకంచేసి వాటికి నాయకత్వం వహించాలని కేసీఆర్‌ కలలుకన్నారు. కానీ ఆ తరువాత ఏమి జరిగిందో అందరికీ తెలుసు. అప్పుడు అటకకెక్కించేసిన ఫెడరల్ ఫ్రంట్‌ను మళ్ళీ క్రిందకు దింపి దానితో జాతీయరాజకీయాలలోకి వెళ్ళేందుకు సిఎం కేసీఆర్‌ రంగం సిద్దం చేసుకొంటున్నట్లు టిఆర్ఎస్‌ నేతలు, మంత్రులు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. 

రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ చేసిన తాజా వ్యాఖ్యలు అవే సూచిస్తున్నాయి. ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిన సిఎం కేసీఆర్‌, దేశానికి ప్రధానమంత్రి కావాలని దేశప్రజలు కోరుకొంటున్నారు. కేసీఆర్‌ దేశప్రధాని అయితే భారతదేశం అమెరికాలాగ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. కేసీఆర్‌ను మించిన సెక్యులర్ నాయకుడు లేడు. ప్రజాసంక్షేమలో ఎన్టీఆర్ తరువాత స్థానం సిఎం కేసీఆర్‌దే. అటువంటి గొప్ప నాయకుడు దేశానికి ప్రధానమంత్రి అయితే దేశానికి ఎంతో మేలు జరుగుతుంది,” అని అన్నారు.          

సిఎం కేసీఆర్‌ జాతీయరాజకీయాలలోకి ప్రవేశిస్తే ఎవరూ కాదనరు. కానీ కేసీఆర్‌ ప్రధానమంత్రి పదవి ఆశిస్తే మరి ప్రధాని నరేంద్రమోడీ తప్పుకోవాలా? లేక వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని కేసీఆర్‌ నేతృత్వంలో ఏర్పాటవుతున్న ఫెడరల్ ఫ్రంట్‌ ఓడించగలదా? అనే సందేహాలు కలుగుతాయి. 

కేసీఆర్‌ కంటే చాలా ఏళ్లుగా మాయావతి, మమాతా బెనర్జీ, నితీశ్ కుమార్, రాహుల్‌ గాంధీ వంటివారు అనేకమంది ప్రధానమంత్రి కావాలని కలలుకంటున్నారు. యూపీలో 80 ఎంపీలు, బెంగాల్-42, బిహార్-40 మంది ఎంపీలుండగా తెలంగాణలో కేవలం 17మంది ఎంపీలే ఉన్నారు. కనుక ఎక్కువ మంది ఎంపీలున్న పార్టీల అధినేతలు తామే ప్రధానమంత్రి కావాలని పట్టుపట్టడం సహజం. 

అదీగాక కాంగ్రెస్ పార్టీని ఫెడరల్ ఫ్రంట్‌కు దూరంగా ఉంచాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ప్రాంతీయపార్టీలలో చాలా వరకు కాంగ్రెస్‌ లేదా బిజెపిలకు తోకపార్టీలుగా ఉండేందుకే మొగ్గు చూపుతుంటాయి. కనుక కాంగ్రెస్‌ను కూడా కలుపుకొనేందుకు కేసీఆర్‌ సిద్దపడితేనే ఫెడరల్ ఫ్రంట్‌ బలపడుతుంది. ఒకవేళ కేసీఆర్‌ కాంగ్రెస్‌తో చేతులు కలిపి పనిచేయడానికి సిద్దపడితే, రాష్ట్రంలో రాజకీయంగా ఇబ్బందికరమవుతుంది. 

ఇక సీఏఏను పట్టుకొని సిఎం కేసీఆర్‌ జాతీయరాజకీయాలలో ప్రవేశించవచ్చునేమో కానీ దీర్గకాలానికి అది పనికిరాదు. 

టిఆర్ఎస్‌ నేతలు కోరుకొంటున్నట్లు ఒకవేళ కేసీఆర్‌ ప్రధానమంత్రి అవ్వాలంటే ఈ సమస్యలన్నిటినీ అధిగమిస్తే సరిపోదు. ఫెడరల్ ఫ్రంట్‌లోని పార్టీలన్నీ కలిసి లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని ఓడించి, కేంద్రప్రభుత్వ ఏర్పాటుకు తగినన్ని ఎంపీ సీట్లు గెలుచుకోవలసి ఉంటుంది. అప్పుడు ఏ పార్టీకి ఎక్కువమంది ఎంపీలుంటే వారికే ప్రధానమంత్రి పదవి లభిస్తుంది. కనుక కేసీఆర్‌ ప్రధాని కావాలని కోరుకొనేవారు ఈ లెక్కల గురించి కూడా ఆలోచిస్తే మంచిది. 


Related Post