ఆమాద్మీ పగటి కలలు కంటోందా?

February 17, 2020


img

అరవింద్ కేజ్రీవాల్‌ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా 3వసారి డిల్లీ ప్రభుత్వంలో అధికారం చేజిక్కించుకొంది. రాజకీయ చాణక్యుడని పేరుపొందిన కేంద్రహోంమంత్రి అమిత్ షా వ్యూహాలు ఏవీ ఈ ఎన్నికలలో ఫలించలేదు. అలాగే ప్రధాని నరేంద్రమోడీ ప్రభావం కూడా పనిచేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఏకంగా 63 నియోజకవర్గాలలో డిపాజిట్లు కోల్పోయింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. అది సహజమే. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీని దేశంలో ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించాలని నిర్ణయించింది. 

ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి గోపాల్ రాయ్ డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ముందుగా ఈ నెల 23 నుంచి మార్చి 23 వరకు అన్ని రాష్ట్రాలలోని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో డిల్లీలో సమావేశమయ్యి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తాము. ఆమ్ ఆద్మీ పార్టీ ఆశయాలు, లక్ష్యాలు, డిల్లీలో సాధించిన ప్రగతిని వివరిస్తూ అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ప్రచారం చేస్తారు. ఆ తరువాత పార్టీ వాలంటీర్లు దేశవ్యాప్తంగా కోటిమందిని కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతారు. అన్ని రాష్ట్రాలలో ప్రధాన నగరాలు, పట్టణాలలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రెస్‌మీట్‌లు నిర్వహించి ప్రింట్,ఎలెక్ట్రానిక్ మాద్యమాల ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తారు. పార్టీ సభ్యత్వం కోసం 98710 10101 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలని కోరుతాము,” అని తెలిపారు.

 దేశరాజధాని డిల్లీలో ఉన్న పరిస్థితులు వేరు. ఇతర రాష్ట్రాలలో ఉండే పరిస్థితులు వేరుగా ఉంటాయని అందరికీ తెలుసు. మళ్ళీ ఉత్తరాది రాష్ట్రాలకు ఈశాన్య రాష్ట్రాలలో వేర్వేరు రాజకీయ పరిస్థితులుంటాయి. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో పూర్తి విభిన్నమైన భాష, సంస్కృతి, కుల,మత, ప్రాంతీయ రాజకీయాలు కనిపిస్తాయి. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపిలే టిఆర్ఎస్‌ ధాటిని తట్టుకోలేకపోతున్నాయి. ఏపీలో నిన్నమొన్నటి వరకు తమకు ఎదురేలేదనుకొన్న టిడిపి వైసీపీ ధాటికి తుడిచిపెట్టుకుపోయింది. ఆంద్రుల అభిమాన హీరో పవన్‌ కల్యాణ్‌ అసెంబ్లీ ఎన్నికలలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు. ఇక తమిళనాడులో ప్రజలు అన్నాడీఎంకె లేదా డీఎంకెలకు మాత్రమే అవకాశం ఇస్తుంటారు. వారి అభిమాన నటుడు కమల్ హాసన్‌హాసన్ కూడా వారు పక్కన పెట్టేశారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అలాగే కేరళలో దశాబ్ధాలుగా కాంగ్రెస్‌, వామపక్షాల కూటమిల మద్యే అధికారమార్పిడి జరుగుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్‌-బిజెపిల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే పంజాబ్‌లో కొంత బలపడింది కనుక ముందుగా ఆ రాష్ట్రంపై దృష్టి పెట్టి పనిచేస్తే ఏమైనా ప్రయోజనం ఉండవచ్చు.


Related Post