అందుకే కేజ్రీవాల్‌ మోడీ ఆశీస్సులు కోరారా?

February 17, 2020


img

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ ఆదివారం ఉదయం డిల్లీలోని రాంలీలా మైదానంలో డిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఆయన ముచ్చటగా 3వసారి ఆ పదవి చేప్పటినట్లయింది. ఆయనతో పాటు ఆరుగురు మనీష్ శిశోదియా, సత్యేందర్ జైన్, రాజేంద్ర పాల్ గౌతమ్, ఇమ్రాన్ హుస్సేన్, కైలాస్ గహ్లోత్, గోపాల్ రాయ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ అనిల్ బైజల్ వారిచేత ప్రమాణస్వీకారం చేయించారు. 

ఈ సందర్భంగా డిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఆమ్ ఆద్మీ గెలుపు డిల్లీ ప్రజలందరి గెలుపు. ఎన్నికల సందర్భంగా జరిగిన రాజకీయాలకు, విమర్శలను అన్నిటినీ మరిచిపోయి డిల్లీలోని అన్ని పార్టీలను సమానంగా చూస్తానని హామీ ఇస్తున్నాను. అలాగే డిల్లీ అభివృద్ధి, డిల్లీ ప్రజల సంక్షేమం కోసం మా ప్రభుత్వానికి కేంద్రం సహాయసహకారాలు అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందుకు మాకు ప్రధాని నరేంద్రమోడీ ఆశీర్వచనాలు కావాలి. డిల్లీ.. ప్రజల కోసం కేంద్రప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకొంటున్నాము. ఎన్నికలు ముగిశాయి కనుక ఇకపై పూర్తిస్థాయి పాలనపై దృష్టి సారించి డిల్లీ ప్రజల కోసం కష్టపడి పనిచేస్తాము,” అని అన్నారు. 

డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించి అధికారం చేజిక్కించుకోవాలని బిజెపి వరుసగా మూడుసార్లు ప్రయత్నించి ఓడిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓడిపోయిన తరువాత ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని కేంద్రం చాలా ఇబ్బంది పెట్టింది. కానీ అరవింద్ కేజ్రీవాల్‌ అత్యంత సమర్ధంగా తన పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే కాక మళ్ళీ ఈసారి ఎన్నికలలో కూడా ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చారు. కనుక కొరకరాని కొయ్యాలా మారిన అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్రం సహకరిస్తుందనుకోలేము. ఈ విషయం అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా బాగానే తెలుసు. కానీ సభాముఖంగా ప్రధాని నరేంద్రమోడీ ఆశీర్వచనాలు కావాలని, తమ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీని కూడా ఆహ్వానించామని, కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్దమని ప్రకటించడం ద్వారా అరవింద్ కేజ్రీవాల్‌ డిల్లీ ప్రజల మనసులు గెలుచుకొనే ప్రయత్నం చేశారు. ఈవిధంగా చెప్పడం ద్వారా ఇకపై తమ ప్రభుత్వానికి, పార్టీకి కేంద్రం ఎటువంటి హాని తలపెట్టినా అది ప్రజల దృష్టిలో దోషిగా నిలబడవలసి వస్తుంది కూడా. కనుక అరవింద్ కేజ్రీవాల్‌ చాలా ముందుచూపుతో ఈ ప్రకటన చేసినట్లు భావించవచ్చు. 


Related Post