తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా షబ్బీర్ అలీ?

February 15, 2020


img

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ, “సీనియర్ కాంగ్రెస్‌ నేత షబ్బీర్ అలీ త్వరలో కీలకపదవి పొందబోతున్నారు,” అని ప్రకటించారు. అయితే ఆ కీలక పదవి ఏదో ఆయన చెప్పలేదు. 

త్వరలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పుకొనున్నారు కనుక ఆయన స్థానంలో సమర్దుడైన వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగించేందుకు గత కొంతకాలం పార్టీలో కసరత్తు జరుగుతోంది. పిసిసి అధ్యక్ష పదవి రేసులో సీనియర్ నేతలు వి.హనుమంతరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌ రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, చిన్నారావు తదితరులున్నారు. షబ్బీర్ అలీ కూడా ఆ పదవిపై ఆసక్తి చూపిస్తున్నప్పటికీ, మిగిలినవారితో పోలిస్తే ఆయన అంత గట్టిగా పట్టుబడుతున్నట్లు కనబడలేదు. కానీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆయనకు కీలకపదవి లభించబోతోందని ఈరోజు ప్రకటించడం విశేషం. 

రాష్ట్రంలో టిఆర్ఎస్‌-మజ్లీస్ పార్టీల బందం నానాటికీ బలపడుతున్నందున, షబీర్ అలీకి పార్టీ పగ్గాలు అప్పగిస్తే రాష్ట్రంలో ముస్లింలను కాంగ్రెస్ పార్టీవైపు ఆకర్షించవచ్చునని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోందేమో? ఒకవేళ షబ్బీర్ అలీకి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినట్లయితే ఆ పదవిని ఆశిస్తున్నవారందరూ నిరాశ చెందుతారు కనుక వారినందరినీ ఆయన కలుపుకుపోవలసి ఉంటుంది. ఒకవేళ షబ్బీర్ అలీకి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వకుంటే ఏఐసీసీలో కీలకపదవిని లేదా వేరే రాష్ట్రానికి కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్-ఛార్జ్ గా నియమించే అవకాశాలున్నాయి.


Related Post