వైసీపీని ఎన్డీయేలో చేర్చుకోవడం లేదు: బిజెపి

February 15, 2020


img

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల వ్యవధిలో రెండుసార్లు డిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులతో వరుసగా భేటీ అవుతుండటంతో వైసీపీ ఎన్డీయే కూటమిలో చేరబోతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

వాటిపై ఏపీ బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ సునీల్ ధియోధర్ స్పందిస్తూ, “వైసీపీనిఎన్డీయే కూటమిలో చేర్చుకోబోతున్నట్లు వినిపిస్తున్న ఊహాగానాలను మేము ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి, కేంద్రమంత్రులను కలవడం సహజమే. వారి భేటీలను రాజకీయకోణంలో నుంచి చూడటం సరికాదు. ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి డిల్లీ వచ్చి ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలను కలిసినంత మాత్రన్న వైసీపీని ఎన్డీయేలో తీసుకొంటామనో...లేదా ఆ పార్టీతో పొత్తులు పెట్టుకొంటామనుకోవడం సరికాదు. వైసీపీ, టిడిపిలు రెంటినీ మా రాజకీయ శత్రువులుగా భావిస్తున్నాం. అయితే వాటితో మాకు రాజకీయంగా విభేదమే తప్ప ఆ పార్టీల నేతలతో వ్యక్తిగతంగా మాకు ఎటువంటి శతృత్వం లేదు. వైసీపీ, టిడిపిలతో పొత్తులు పెట్టుకోబోము. ఏ‌పీలో టిడిపి, వైసీపీలతో సహా అన్ని పార్టీలు కుల రాజకీయాలు చేస్తుంటాయి. వాటికి అతీతంగా పనిచేస్తున్న జనసేన పార్టీతో మాపార్టీ పొత్తు పెట్టుకొంది. ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొంటున్న తప్పుడు నిర్ణయాల కారణంగా రాష్ట్రం మరింత సమస్యలలో కూరుకుపోతోంది. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు వెనక్కు మళ్లిపోతున్నాయి. కనుక ఏపీ సమస్యల పరిష్కారం కోసం మా రెండు పార్టీలు కలిసి పోరాడుతాయి,” అని అన్నారు. 


ఏపీలో బిజెపి, జనసేనలు కలిసి రాజధాని తరలింపుకు వ్యతిరేకిస్తూ పోరాడుతున్నాయి. అయితే.. కేంద్రంలో బిజెపియే అధికారంలో ఉన్నప్పటికీ.. రాజధాని తరలింపును అడ్డుకొనే ప్రయత్నం చేయకపోవడంతో బిజెపి ద్వందవైఖరి బయటపడింది. ద్వందవైఖరితో వ్యవహరిస్తున్న బిజెపితో పొత్తులు పెట్టుకొని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కూడా తమను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఏపీ ప్రజలు భావిస్తే తప్పుకాదు. 

రాజధాని వ్యవహారంలో బిజెపి ఏవిధంగా ద్వందవైఖరితో వ్యవహరిస్తోందో అదేవిధంగా వైసీపీతో రహస్య అవగాహన చేసుకొని అవసరమైనప్పుడు పార్లమెంటులో దాని మద్దతు పొందుతుండటం అందరూ గమనిస్తూనే ఉన్నారు. కనుక బిజెపి వైసీపీతో ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకోకపోయినా బిజెపికి ఏమీ తేడా చేయదు. 


Related Post