రేపు సాయంత్రం ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం

February 15, 2020


img

ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం, శాసనసభ బడ్జెట్‌ సమావేశాల షెడ్యూల్, పట్టణ ప్రగతి తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా శాసనసభ సమావేశాలకు ముందుగా మంత్రివర్గ సమావేశం నిర్వహించడం ఆనవాయితీ కనుక వచ్చే వారంలోనే శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కావచ్చు. సీఏఏను వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేస్తామని సిఎం కేసీఆర్‌ ప్రకటించారు కనుక రేపటి మంత్రివర్గ సమావేశంలో దానిపై కూడా మరోసారి చర్చించి ఆమోదం తెలుపవచ్చు.     

గత సంవత్సరం హరీష్‌రావు ఆర్ధికమంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికే 2019-20 బడ్జెట్‌ సిద్దం అయిపోయింది. కానీ ఈసారి ఆయన పర్యవేక్షణలో 2020-21 బడ్జెట్‌ తయారవుతోంది. ఆర్ధికమాంద్యం, కేంద్రం నుంచి సకాలంలో నిధులు విడుదల కాకపోవడం, ప్రభుత్వంపై రుణభారంతో రాష్ట్ర ఆర్ధికపరిస్థితి ఒత్తిడికి గురవుతోంది. అయినప్పటికీ రాష్ట్రంలో సాగుతున్న అభివృద్ధి పనులకు, సంక్షేమ పధకాలకు మంత్రి హరీష్‌రావు సరిపడినన్ని నిధులు సమకూర్చవలసి ఉంటుంది. వాటికోసం ప్రజలపై పన్నుల భారం మోపినా, ఛార్జీలు పెంచినా విమర్శలు తప్పవు. కనుక ఆదాయం-అప్పులు-ఖర్చులు అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొంటూ మంత్రి హరీష్‌రావు ఏవిధంగా బడ్జెట్‌ రూపొందిస్తారో చూడాలి.


Related Post