కేసీఆర్‌ వద్దనా ధైర్యం చేశాం...

February 15, 2020


img

ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “ఏపీఎస్ ఆర్టీసీని మేము ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించుకొన్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్దని వారించారు. ఆవిధంగా చేస్తే ప్రభుత్వంపై చాలా ఆర్ధికభారం పడుతుందని, కార్మికుల జీతాల చెల్లింపు ప్రభుత్వానికి గుదిబండగా మారే ప్రమాదం ఉంటుందని సిఎం కేసీఆర్‌ మమ్మల్ని హెచ్చరించారు. కానీ ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన వాగ్ధానానికి కట్టుబడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. కనుక ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయమని చెప్పవచ్చు. కార్మికులపై నమ్మకంతో మా ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం సరైనదేనని నిరూపిస్తాము. కనుక ఆర్టీసీ కార్మికులు కూడా ప్రభుత్వం తమపై ఉంచిన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొంటూ ఆర్టీసీని లాభాలబాటలో నడిపించేందుకు గట్టిగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ మా నిర్ణయం తప్పని తేలితే నేను నా పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణలు చెపుతాను,” అని అన్నారు. 

ఆర్టీసీ నిర్వహణ లాభదాయకం కాదని భావించిన సిఎం కేసీఆర్‌, నష్టాల ఊబిలో మునిగిన ఆర్టీసీని గాడిన పెట్టేందుకు గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో సుమారు 1,200 ఆర్టీసీ బస్సులను సర్వీసుల నుంచి తొలగించి వాటిని కార్గో సర్వీసులుగా మార్చుతున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ కూడా నష్టాలలోనే కొనసాగుతున్నప్పటికీ, ఏపీ ప్రభుత్వం ఎటువంటి నష్టనివారణ చర్యలు తీసుకోకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి యదాతధంగా నడిపిస్తోంది. కనుక సిఎం కేసీఆర్‌ చెప్పినట్లుగానే రానున్న రోజులలో ఏపీఎస్ ఆర్టీసీ పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉండవచ్చు. ఆర్టీసీ విషయంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు తీసుకొన్న పూర్తి భిన్నమైన నిర్ణయాలలో ఏది సరైనదో ఏడాదిలోగానే తెలిసిపోవచ్చు.


Related Post