మెట్రో అధికారులపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం

February 15, 2020


img

ఈ నెల 7న జరిగిన ఎంజీబీఎస్-జెబిఎస్ మెట్రో ప్రారంభోత్సవానికి తమను ఆహ్వానించనందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బిజెపి ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు, రాష్ట్ర బిజెపి నేతలు మెట్రో అధికారులపై ఆగ్రహంగా ఉన్నారు. ప్రోటోకాల్ ప్రకారం నియోజకవర్గ ఎంపీ, ఎమ్మెల్సీలను ఆహ్వానించకపోవడాన్ని వారు తప్పు పడుతున్నారు. ఇంతకాలం ఆగిన మెట్రో అధికారులు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పార్లమెంటు సమావేశాలలో బిజీగా ఉన్నప్పుడు, బిజెపి నేతలెవరినీ ఆహ్వానించకుండా హడావుడిగా సిఎం కేసీఆర్‌ చేత మెట్రో సేవలను ప్రారంభించడాన్ని వారు తప్పు పడుతున్నారు. 

కనుక కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం దిల్‌ఖుషా గెస్ట్‌హౌజ్‌లో మెట్రో, ఎల్‌అండ్‌టీ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు, రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో సహా పలువురు సీనియర్ నేతలు మెట్రో అధికారులతో జెబిఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రోలో ప్రయాణించి ఆ కారిడార్‌లో జరిగిన పనులను పరిశీలించనున్నారు. 

హైదరాబాద్‌ మెట్రో నిర్మాణానికి కేంద్రప్రభుత్వం కూడా భారీగా నిధులు అందిస్తున్నప్పటికీ, తమకు పట్టించుకోకుండా మెట్రో అధికారులు కేవలం సిఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు ప్రాధాన్యం ఇస్తూ టిఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తుండటాన్ని బిజెపి నేతలు తప్పు పడుతున్నారు. కనుక ఈరోజు జరుగబోయే సమావేశం, బిజెపి నేతల మెట్రో ప్రయాణం రెండూ కొంచెం వేడివేడిగా సాగవచ్చు. Related Post