జగన్ మళ్ళీ డిల్లీకి... దేనికో?

February 14, 2020


img

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల వ్యవదిలో రెండుసార్లు డిల్లీకి వెళ్ళిరావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బుదవారం ఆయన డిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీని కలిసి వచ్చారు. మళ్ళీ ఇవాళ్ళ డిల్లీ వెళ్ళి కేంద్రహోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు, శాసనమండలి రద్దు నిర్ణయాల గురించి ప్రధాని నరేంద్రమోడీకి వివరించిన జగన్మోహన్‌రెడ్డి, వాటి గురించి కేంద్రహోంమంత్రి అమిత్ షాకు వివరించడానికే డిల్లీ వెళుతున్నారని వైసీపీ వర్గాలు చెపుతున్నాయి. కానీ వైసీపీ కూడా ఎన్డీయే కూటమిలో చేర్చుకొనేందుకే చర్చల నిమిత్తం జగన్ డిల్లీ వెళ్ళినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ వైసీపీని ఎన్డీయేలో చేర్చుకొన్నట్లయితే ఆ పార్టీకి ఒకటో రెండో కేంద్రమంత్రి పదవులు లభించే అవకాశం ఉంటుంది. ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డిలపై నడుస్తున్న సిబిఐ కేసులు మళ్ళీ అటకెక్కినా ఆశ్చర్యం లేదు. దీంతో రాజధాని తరలింపు విషయంలో జగన్ ప్రభుత్వ నిర్ణయాలకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపినట్లే అవుతుంది కనుక ఇకపై ఏపీ బిజెపి ఎన్ని అభ్యంతరాలు చెప్పినా వాటికి విలువుండదు. మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబునాయుడుకి, టిడిపికి, అమరావతి రైతులకు కూడా ఇది చాలా నిరాశ కలిగించే విషయమే.

ఒకవేళ వైసీపీ ఎన్డీయే కూటమిలో చేరినట్లయితే సిఎం కేసీఆర్‌కు ఏర్పాటుచేయబోతున్న ఫెడరల్ ఫ్రంట్‌ నుంచి ఒక బలమైన పార్టీ జారిపోయినట్లవుతుంది కనుక ఆయనకు కూడా ఇది నష్టంగానే భావించవచ్చు. ఈ ఊహాగానాలు నిజమో కాదో త్వరలోనే తెలుస్తుంది.


Related Post