కేంద్రప్రభుత్వ వైఖరిపై కేటీఆర్‌ నిశిత విమర్శలు

February 14, 2020


img

డిల్లీలో టైమ్స్‌ నౌ యాక్షన్ ప్లాన్ - 2020 సమ్మిట్ అధ్వర్యంలో ‘దేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర’ అనే అంశంపై గురువారం జరిగిన చర్చా కార్యక్రమంలో ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, “భారతదేశం ఫెడరల్ వ్యవస్థ అనే సంగతి మరిచిపోయి రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరికాదు. రాష్ట్రాల నుంచి వచ్చే పన్ను ఆదాయంలో వాటికి న్యాయంగా రావలసిన వాటాను తిరిగి ఇవ్వడం ఏదో మేలు చేసినట్లు కేంద్రప్రభుత్వం మాట్లాడటం సరికాదు. అలాగే రాష్ట్రాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలంతూ పార్లమెంటులో  ఎంపీలు కేంద్రాన్ని వేడుకోలసిరావడం, దానికి కేంద్రం అహంభావంతో సమాధానాలు చెప్పడం సరికాదు.

రాష్ట్రాలు బలంగా ఉన్నప్పుడే దేశం కూడా బలపడుతుందని కేంద్రం గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కోపరేటివ్ ఫెడరలిజం, టీమ్ ఇండియా వంటి పెద్ద పెద్ద మాటలు చెప్పే ప్రధాని నరేంద్రమోడీ వాటిని ఆచరణలో పెట్టి చూపిస్తే బాగుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం గత ఆరేళ్ళలో అనేక అభివృద్ధి పనులు చేపట్టింది. మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ వంటివి దేశానికే ఆదర్శంగా నిలిచాయి. కానీ మేము ఎన్నిసార్లు అడిగినా కేంద్రం వాటికి నిధులు విడుదల చేయలేదు. దేశానికే గర్వకారణంగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయప్రాజెక్టు హోదా ఇవ్వలేదు. ఈ వైఖరి సరికాదని నేను భావిస్తున్నాను.

రాష్ట్రాల పట్ల కేంద్రం చులకనగా వ్యవహరిస్తుండటం వలననే జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రజాధారణ తగ్గుతోంది. ఆ రెండు జాతీయపార్టీల వలన దేశానికి పెద్దగా ఒరిగిందేమీ లేదని ప్రజలు నమ్ముతున్నందునే ఎక్కడికక్కడ ప్రాంతీయపార్టీలకు ప్రజాధారణ పెరుగుతోంది. భవిష్యత్‌లో ప్రాంతీయపార్టీలతో కూడిన కూటమే దేశాన్ని నడిపించబోతోందని నేను భావిస్తున్నాను,” అని అన్నారు. 


Related Post