పేదరికాన్ని దాచేద్దాం ట్రంప్‌కు కనబడకుండా...

February 14, 2020


img

ప్రభుత్వాలు తరచూ చెప్పే మాట ‘పేదరికాన్ని నిర్మూలిద్దాం’ అని. కానీ అది అంతా వీజీ కాదు కనుక ‘పేదరికాన్ని దాచేద్దాం’ అంటోంది గుజరాత్‌లోని బిజెపి ప్రభుత్వం. 

ఈనెల 24న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీసమేతంగా అహ్మదాబాద్‌కు రానున్నారు. వారు అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో దిగి రోడ్డు మార్గం ద్వారా గాంధీనగర్ చేరుకొంటారు. అయితే మద్యలో రోడ్డు పక్కనే మురికివాడలున్నాయి. వాటిలో సుమారు 500 నిరుపేద కుటుంబాలు నివసిస్తున్నాయి. తన పాలనలో భారత్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పుకోవాలని ఆరాటపడుతున్న ప్రధాని నరేంద్రమోడీకి విమానం దిగగానే రోడ్డుపక్కన మురికివాడలు...వాటిలో నివసించే నిరుపేదలపై డొనాల్డ్ ట్రంప్ దంపతుల దృష్టి పడేతే ఇబ్బందిగానే ఉంటుంది. కనుక వారు...వారి గుడిసెలు కనిపించకుండా సుమారు కిలోమీటరు పొడవునా 7 అడుగుల ఎత్తు గోడను హడావుడిగా అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ నిర్మింపజేస్తోంది. ఆ గోడ పక్కనే దారి పొడవునా ఖర్జూరం చెట్లను తీసుకువచ్చి నాటిస్తున్నారు. ఏనాడూ మరమత్తులకు నోచుకోని అక్కడి రోడ్ల స్థానంలో దగదగా మెరిసిపోయే కొత్త రోడ్లను నిర్మించి రోడ్లకు ఇరువైపులా అందమైన విద్యుత్ దీపాలు కూడా ఏర్పాటు చేయిస్తున్నారు. 

ట్రంప్ దృష్టిలో పడకుండా తమను దాచిపెట్టేందుకు మునిసిపల్ అధికారులు గోడ నిర్మింపజేయడం అవమానకరమే కానీ ట్రంప్ పుణ్యామని ఇన్నేళ్లకు తమ ప్రాంతంలో రోడ్లు, కాలువలు, విద్యుత్ దీపాలు అన్నీ ఏర్పాటవుతున్నాయని ఆ మురికివాడలో ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. 

2017లో ట్రంప్ కుమార్తె ఇవాంక హైదరాబాద్‌ పర్యటించినప్పుడు, నగరంలో బిచ్చగాళ్ళు ఆమెకు కనబడకుండా వేరే ప్రాంతాలకు తరలించారు. ప్రభుత్వాలు పేదరికాన్ని నిర్మూలించలేవు కనుక ఈవిధంగా దాచేయడమే సులువు..చిరిగిపోయిన చొక్కాపై సూటు ధరించినట్లు!


Related Post